ఉద్యోగం – కెరీర్: నెలకు 6 లక్షలు సంపాదిస్తున్న 18 ఏళ్ల యువకుడు! విదేశాలకు వెళ్లడం కంటే గేదెల పెంపకమే మిన్న అంటున్నాడు!

సాధారణంగా ఇంజనీరింగ్, MBBS పూర్తి చేసిన యువతీ యువకులు ఉన్నత చదువుల కోసం లేదా మంచి ఉద్యోగం కోసం అమెరికా, జర్మనీ, కెనడా వంటి దేశాలకు వెళ్తుంటారు. అయితే కోవిడ్ తర్వాత మారిన వీసా నిబంధనల వల్ల విదేశాలకు వెళ్లే వారి సంఖ్య కొంత తగ్గిందని చెప్పవచ్చు.

కానీ, ఇక్కడొక 18 ఏళ్ల యువకుడు మాత్రం విదేశాలకు వెళ్లి చదవడం దండగ అని అంటున్నాడు. అవును.. పంజాబ్ రాష్ట్రంలోని సెహ్లా గ్రామానికి చెందిన సోహల్‌ప్రీత్ సింగ్ సిద్ధూ తన జీవితంలో ఏం చేయాలో ఇప్పటికే ఒక స్పష్టమైన మార్గాన్ని ఎంచుకున్నాడు.

అతను విదేశాలకు వెళ్లే ఆలోచన చేయడం లేదు. దానికి బదులుగా, తన డైరీ ఫార్మ్ (పాడి పరిశ్రమ) ద్వారా ప్రతి నెలా 5 నుండి 6 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు.

విదేశీ చదువుల కంటే వ్యాపారానికే మొగ్గు 41 ఏళ్ల బల్బీర్ సింగ్ సిద్ధూ ఏకైక కుమారుడైన సోహల్‌ప్రీత్, ఉన్నత చదువుల కంటే సొంతంగా ఎదగాలనే ఉద్దేశంతో వ్యాపారాన్ని ఎంచుకున్నాడు. ఓపెన్ ఎడ్యుకేషన్ ద్వారా 12వ తరగతి పూర్తి చేసిన అతను, మున్ముందు పశువైద్య కోర్సు (Veterinary Course) చేయాలని యోచిస్తున్నాడు. ఇతర దేశాలకు వలస వెళ్లడం కంటే, క్షేత్రస్థాయిలో సంపాదించే జ్ఞానమే తన భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దుతుందని అతను నమ్ముతున్నాడు.

15 ఏళ్లకే మొదలైన ప్రస్థానం సోహల్‌ప్రీత్ ప్రస్థానం తన 15వ ఏటనే మొదలైంది. ఒక గేదెను కొనుగోలు చేయడానికి అతను తన కుటుంబాన్ని ఒప్పించాడు. ఆ సమయంలో వారి ఇంట్లో ఇప్పటికే చిన్న డైరీలో భాగంగా నాలుగైదు గేదెలు ఉండేవి. ఆగస్టు 2023లో అతని కుటుంబం 1.20 లక్షల రూపాయల పెట్టుబడితో మొదటి గేదెను కొనిచ్చింది. ఐదు పశువులతో సొంతంగా పాడి పరిశ్రమను నిర్వహించడం ప్రారంభించిన అతను, మొదటి ఏడాది వచ్చిన లాభాన్ని తిరిగి మరిన్ని పశువుల కొనుగోలుకే పెట్టుబడిగా పెట్టాడు.

పాడి పరిశ్రమపై చిన్నప్పటి నుండే ఆసక్తి “నాకు చిన్నప్పటి నుండి పశువుల పెంపకం అంటే చాలా ఆసక్తి. మా కుటుంబం కూడా ఇంటి అవసరాల కోసం పశువులను పెంచేది” అని సోహల్‌ప్రీత్ అంటున్నాడు. మూడు సంవత్సరాల వ్యవధిలోనే అతను తన ఫార్మ్‌ను భారీగా విస్తరించాడు. ప్రస్తుతం అతని వద్ద 55 గేదెలు, 15 ఆవులు, 50 లేగదూడలతో కలిపి మొత్తం 120 పశువులు ఉన్నాయి.

అతని వద్ద 53 ముర్రా గేదెలు, రెండు నీలీ రవి గేదెలు, 12 హోల్‌స్టెయిన్ ఫ్రైసియన్ (HF) ఆవులు, రెండు జెర్సీ ఆవులు వంటి ఖరీదైన జాతులు ఉన్నాయి.

తల్లిదండ్రులకు స్పష్టమైన సందేశం చాలా కుటుంబాలు తమ పిల్లలను విదేశాలకు పంపాలని ఆరాటపడతాయి. కానీ సోహల్‌ప్రీత్ తన నిర్ణయాన్ని ముందే తల్లిదండ్రులకు చెప్పేశాడు. “నన్ను విదేశాలకు పంపడానికి వృథాగా డబ్బు ఖర్చు చేయకండి. ఆ డబ్బును నా వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టి నాకు మద్దతు ఇవ్వండి” అని కోరాడు.

ప్రస్తుతం అతని ఫార్మ్ నుండి ప్రతిరోజూ 650-700 లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. వీటిని బర్నాలాలోని ఒక ప్రైవేట్ కంపెనీకి విక్రయిస్తున్నాడు. పాల విక్రయాల ద్వారా నెలకు సుమారు 10 లక్షల రూపాయల ఆదాయం వస్తుండగా, అందులో 60 శాతం (సుమారు 6 లక్షలు) నిఖర లాభంగా మిగులుతోంది.

వారి కుటుంబానికి 20 ఎకరాల సొంత భూమి ఉండగా, మరో 22 ఎకరాలను కౌలుకు తీసుకున్నారు. అందులో ఒక ఎకరంలో అత్యాధునిక శాస్త్రీయ పద్ధతులతో డైరీ ఫార్మ్‌ను నిర్వహిస్తూ ప్రతి ఏటా విస్తరిస్తున్నాడు.


Posted

in

by

Tags: