నేటి కాలంలో ప్రపంచవ్యాప్తంగా అందరినీ వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య ఊబకాయం (Obesity). బరువు తగ్గడం అనేది చాలా కష్టమైన పనిగా భావిస్తారు, ముఖ్యంగా మెటబాలిజం (జీవక్రియ) మందగించిన వారికి ఇది మరింత సవాలుతో కూడుకున్నది.
కానీ, ఏకంగా 85 కేజీల బరువు తగ్గి, తన జీవనశైలి మార్పు ద్వారా ఇది సాధ్యమని నిరూపించిన ప్రాంజల్ పాండే అనే పోషకాహార నిపుణురాలి ప్రయాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
150 కేజీల నుండి 68 కేజీలకు.. సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ ప్రాంజల్ పాండే తన వెయిట్ లాస్ జర్నీని ఇన్స్టాగ్రామ్లో పంచుకుంటూ.. “నేను ఎప్పటికైనా సన్నబడతానని, వెయిట్ మెషిన్ మీద నా బరువు రెండు అంకెల సంఖ్యలో (Double digit) చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఈ ప్రయాణంలో రక్తం, చెమట మరియు కన్నీళ్లు ఉన్నాయి. ఎట్టకేలకు ఇన్నేళ్ల తర్వాత నా బరువు పట్ల నేను సంతృప్తిగా ఉన్నాను” అని రాశారు. “బరువు తగ్గడం అనేది కేవలం ఏదో ఒక డైట్ లేదా వ్యాయామం ద్వారా సాధ్యపడదు, ఇది పూర్తి జీవనశైలి మార్పుతోనే సాధ్యం” అని ఆమె పేర్కొన్నారు.
ఆమె పాటించిన ఆహార నియమాలు: ప్రంజల్ ఎటువంటి కఠినమైన డైట్లు చేయలేదు. ఆమె పాటించిన కొన్ని ముఖ్యమైన అలవాట్లు ఇవే:
- ప్రోటీన్కు ప్రాధాన్యత: ప్రతి భోజనంలో చేపలు, చికెన్, గుడ్లు, పనీర్, టోఫు లేదా గ్రీక్ పెరుగు వంటి ప్రోటీన్ ఉండేలా చూసుకున్నారు.
- కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు: తృణధాన్యాలు, పండ్లు మరియు కూరగాయలను తన ఆహారంలో ప్రధాన భాగం చేసుకున్నారు.
- నీరు తాగడం: మెటబాలిజం క్రమబద్ధంగా ఉండటానికి రోజుకు 4 లీటర్ల నీరు తాగేవారు.
- స్మార్ట్ టిప్స్: భోజనానికి ముందు సలాడ్లు, గింజలు (Seeds & Nuts) మరియు పీచు పదార్థం (Fiber) ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల ఆమె చురుగ్గా ఉండగలిగారు.
- డిటాక్స్ డ్రింక్: ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం లేదా ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి తీసుకునేవారు.
వ్యాయామం: అసలైన మార్పు ఇక్కడే! తీవ్రమైన కసరత్తుల కంటే స్థిరత్వం (Consistency) ముఖ్యమని ప్రాంజల్ నమ్మారు. ఆమె మంత్రం ఒక్కటే:
- భోజనం తర్వాత నడక: ప్రతి భోజనం తర్వాత కనీసం 10 నిమిషాలు నడవడం ఆమె జీర్ణక్రియను మెరుగుపరిచింది. ఇది ఆమె బరువు తగ్గడంలో గేమ్ చేంజర్ అని చెప్పవచ్చు.
- పనిలో కూడా కదలిక: బిజీగా ఉన్నప్పుడు నడవలేకపోతే, ఒకే చోట నిలబడి 10-15 స్క్వాట్స్ (Squats) చేసేవారు.
- రాత్రి భోజనం: పడుకోవడానికి 2-3 గంటల ముందే భోజనం పూర్తి చేయడం వల్ల బరువు తగ్గడంలో మంచి ఫలితం కనిపించింది.
