కర్ణాటక రాష్ట్రం విజయనగర జిల్లాలోని కొట్టూరు పట్టణంలో ఒక యువకుడు తన సొంత కుటుంబాన్నే ఊచకోత కోశాడు. ఈ దారుణ హత్యలు చేసిన తర్వాత, ఆ మృతదేహాలను పాతిపెట్టేందుకు అతను చేసిన ప్రయత్నాలు పోలీసులు మరియు స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి.
చిత్రదుర్గ జిల్లాకు చెందిన అక్షయ్ కుమార్ (27) అనే యువకుడు తన తండ్రి భీమ్రాజ్ (53), తల్లి జయలక్ష్మి (50), మరియు చెల్లెలు అమృత (17)తో కలిసి కొట్టూరులో నివసిస్తున్నాడు. వీరు అక్కడ అద్దె ఇంట్లో ఉంటూ టైర్ రీట్రెడింగ్ వ్యాపారం చేస్తున్నారు. గత జనవరి 27న, ఇంట్లో తల్లి ఒంటరిగా ఉన్న సమయంలో అక్షయ్ కుమార్ ఆమె గొంతు కోసి హత్య చేశాడు.
బహుమతి అని పిలిచి చెల్లెలిని.. అనంతరం తన చెల్లెలు అమృతకు ఫోన్ చేసి, “నీకు ఒక గిఫ్ట్ కొన్నాను, త్వరగా ఇంటికి రా” అని పిలిచాడు. ఆ చిన్నారి ఆశగా ఇంటికి రాగానే, ఆమెను కూడా కత్తితో పొడిచి చంపేసి తల్లి శవం పక్కనే పడేశాడు. ఏమీ తెలియని తండ్రి పని ముగించుకుని ఇంటికి వచ్చి టీవీ చూస్తుండగా, వెనుక నుండి దాడి చేసి ఆయన గొంతు కోసి చంపేశాడు.
ఇంట్లోనే పూడ్చిపెట్టి నాటకం.. ముగ్గురినీ చంపిన తర్వాత ఇంట్లోనే పెద్ద గోతిని తవ్వి.. మొదట తల్లిని, ఆ పైన చెల్లెలిని, చివరగా తండ్రి మృతదేహాలను ఒకదానిపై ఒకటి వేసి పూడ్చిపెట్టాడు. ఎవరికీ అనుమానం రాకుండా బెంగళూరులోని తిలక్ నగర్ పోలీసులకు వెళ్లి ఒక తప్పుడు ఫిర్యాదు ఇచ్చాడు. “నా తండ్రి వైద్యం కోసం అమ్మ, చెల్లెలితో కలిసి బెంగళూరు వచ్చారు. ఒక బంధువుకు ఇచ్చేందుకు ₹4 లక్షల నగదు తెచ్చారు. కానీ అకస్మాత్తుగా ముగ్గురూ మాయమైపోయారు” అని పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు.
₹1.50 కోట్ల ఆస్తి మరియు పరువు హత్య: అక్షయ్ కుమార్ మాటల్లో పొంతన లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చి గట్టిగా విచారించగా అసలు నిజం ఒప్పుకున్నాడు. ఎస్పీ జాన్వీ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి తవ్వి చూడగా మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి.
అక్షయ్ కుమార్ వాంగ్మూలం: అక్షయ్ కుమార్ ఆన్లైన్ జూదానికి అలవాటు పడ్డాడు. తన తండ్రి ఇల్లు అమ్మగా వచ్చిన ₹1.50 కోట్ల రూపాయలు తనకు ఇవ్వాలని గొడవ పడేవాడు. జూదంలో పోగొడతావని తండ్రి నిరాకరించడం అతనికి కోపం తెప్పించింది. మరోవైపు, తన చెల్లెలు వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమించి గర్భవతి అయిందని, తల్లిదండ్రులు ఆమెకు ఆ యువకుడితోనే పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారని.. అది ఇష్టం లేక పరువు పోతుందని భావించి ముగ్గురినీ చంపేసినట్లు ఒప్పుకున్నాడు.
తండ్రి కాళ్లు నరికేసి.. మృతదేహాలను వెలికితీసినప్పుడు తండ్రి భీమ్రాజ్ కాళ్లు వేరుగా ఉండటం చూసి పోలీసులు షాక్ అయ్యారు. దీనిపై అక్షయ్‌ను ప్రశ్నించగా.. “గోతిలో శవం సరిగ్గా పట్టడం లేదు, అందుకే కాళ్లు నరికేసి అదే గోతిలో వేసి పూడ్చేశాను” అని అత్యంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు.
