ఫరీదాబాద్: పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా ఉంది ఫరీదాబాద్‌లోని ఎస్‌బిఐ బ్యాంక్ పరిస్థితి. దేశంలోనే నంబర్ వన్ బ్యాంక్‌గా పేరున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక సిఏ (CA) కు చెందిన లాకరే మాయమైపోయింది. ఆ లాకర్‌లో సుమారు రెండు కోట్ల రూపాయల విలువైన బంగారం, మూడు కిలోల వెండితో పాటు ఇతర విలువైన వస్తువులు ఉన్నాయి.
ఈ ఘటనపై బాధితుడు బ్యాంకు ప్రధాన కార్యాలయ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకు అధికారుల కుమ్మక్కుతోనే తన లాకర్ మాయమైందని ఆయన ఆరోపిస్తున్నారు.
సంఘటన వివరాలు: సిఏ డి.సి. గర్గ్ 2014లో ఫరీదాబాద్‌లోని సెక్టార్ 15 ఎస్‌బిఐ బ్రాంచ్‌లో ఒక లాకర్‌ను తీసుకున్నారు. గత 12 ఏళ్లుగా ఆ లాకర్‌ను వాడుతున్నారు. రెండు రోజుల క్రితం గర్గ్ భార్య లాకర్‌ను తెరవడానికి బ్యాంకుకు వెళ్లగా, అక్కడ వారి పేరు మీద అసలు లాకరే లేదని తెలిసి షాక్‌కు గురయ్యారు. ఆ నంబర్ గల లాకర్‌ను బ్యాంకు యాజమాన్యం వేరే వ్యక్తికి కేటాయించింది.
గర్గ్ వాదన ప్రకారం.. తన వద్ద లాకర్‌కు సంబంధించిన ఒరిజినల్ తాళం చెవి (Key) ఉంది. ఒకవేళ తాను లాకర్‌ను సరెండర్ చేసి ఉంటే, బ్యాంకు వారు తన వద్ద నుండి తాళం చెవిని తీసుకునేవారు. కానీ తన ఖాతా నుండి ప్రతి ఏటా ₹2,360 లాకర్ ఫీజు కట్ అవుతూనే ఉంది. ఏడాది క్రితం వరకు కూడా ఫీజు కట్ అయ్యింది.
వస్తువుల వివరాలు: తమ లాకర్‌లో సుమారు ఒకటిన్నర కిలోల బంగారు ఆభరణాలు, 3 కిలోల వెండి మరియు ఇతర విలువైన పత్రాలు ఉన్నాయని బాధితుడు తెలిపారు. బ్యాంకు అధికారులు తన లాకర్‌ను పగలగొట్టి, అందులోని సామాగ్రిని మాయం చేసి, అదే నంబర్‌ను వికాస్ చౌహాన్ అనే వ్యక్తికి కేటాయించారని గర్గ్ ఆరోపిస్తున్నారు. తన లాకర్ ఎప్పుడు పగలగొట్టారు, సామాగ్రి ఎక్కడికి పోయిందనే విషయంపై బ్యాంకు వద్ద సమాధానం లేదు.
