సేఫ్టీ పిన్ అడుగున ఉండే ఆ రంధ్రం ఎందుకో తెలుసా? ఇన్ని రోజులు ఈ విషయం తెలియకుండానే వాడేస్తున్నామే!

మన నిత్య జీవితంలో చిన్న వస్తువులే పెద్ద పనులను చక్కబెడతాయి. బట్టలు చిరిగినా లేదా వాటిని కలిపి ఉంచాలన్నా మనం వెంటనే వెతికేది ‘సేఫ్టీ పిన్’. చీర కట్టు నుండి చిన్న పిల్లల డైపర్ల వరకు దీని వినియోగం చాలా ఎక్కువ. మనం ఎన్నేళ్లుగా దీనిని వాడుతున్నా, దాని అడుగు భాగంలో ఉండే ఆ చిన్న గుండ్రని వలయం ఎందుకు ఉందో ఎప్పుడైనా ఆలోచించామా? అది కేవలం డిజైన్ కోసమో లేదా దారం ఎక్కించడానికో అని మనం అనుకుంటాం. కానీ అసలు కారణం అది కాదు.

ఆవిష్కరణ: దీనిని అమెరికాకు చెందిన వాల్టర్ హంట్ అనే వ్యక్తి కనుగొన్నారు. ఒక పాత ఇనుప తీగతో ఆడుకుంటూ దానిని మెలితిప్పుతున్నప్పుడు ఆయనకు ఈ ఆలోచన వచ్చింది. ఆయన దీనిని రూపొందించినప్పుడు అందం కంటే కూడా అది పకడ్బందీగా ఎలా పనిచేయాలనే దానిపైనే దృష్టి పెట్టారు.

అది కేవలం రంధ్రం కాదు, అదొక స్ప్రింగ్: పిన్ అడుగున మనం చూసే ఆ వలయం నిజానికి రంధ్రం కాదు. అది తీగను గుండ్రంగా చుట్టిన ఒక స్ప్రింగ్. దీనిని ఇంగ్లీష్‌లో ‘టార్షన్ స్ప్రింగ్’ (Torsion Spring) అని పిలుస్తారు. ఈ చుట్టనే ఆ పిన్‌కు అవసరమైన ఒత్తిడిని (Pressure) ఇస్తుంది. మనం పిన్‌ను తెరిచి మళ్ళీ మూసినప్పుడు, అది తన పాత స్థితికి చేరుకోవడానికి కారణం ఈ స్ప్రింగ్ అమరికయే.

ఎందుకు అలా వంచాలి? ఒకవేళ ఆ ప్రదేశంలో గుండ్రని వలయం లేకుండా, తీగను నేరుగా ‘V’ ఆకారంలోనో లేదా ‘L’ ఆకారంలోనో వంచి ఉంటే, మీరు ఒకటి రెండు సార్లు వాడగానే ఆ తీగ విరిగిపోయేది. ఎందుకంటే పదునైన వంపుల వద్ద ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కానీ తీగను గుండ్రంగా చుట్టడం వల్ల, మనం ఇచ్చే ఒత్తిడి తీగ అంతటా సమానంగా పంపిణీ అవుతుంది. దీనివల్ల పిన్ వంగుతుంది తప్ప విరిగిపోదు. ఇదే దాని మన్నికకు అసలు రహస్యం.


Posted

in

by

Tags: