మల విసర్జన తర్వాత కడుపు తేలికగా అనిపిస్తుంది. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ విరేచనం సాఫీగా జరగడం చాలా అవసరం. అయితే కేవలం కడుపు శుభ్రపడటమే సరిపోదు, మలం యొక్క స్వభావాన్ని గమనించడం కూడా అంతే ముఖ్యం అని నిపుణులు చెబుతున్నారు.
మలం మరీ పల్చగా ఉన్నా లేదా గట్టిగా ఉన్నా మనం గమనిస్తాం. కానీ, మలం నీటిలో తేలుతుంటే దాని అర్థం ఏమిటో మీకు తెలుసా? నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది పలు అనారోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మలం నీటిలో తేలడానికి 5 ప్రధాన కారణాలు:
1. అధికంగా గ్యాస్ ఏర్పడటం: మీ మలం టాయిలెట్ సీటులో నీటిపై తేలుతుంటే, మీకు గ్యాస్ సమస్య ఉందని అర్థం. మీ ప్రేగుల ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు మలంలో గాలి చేరి అది తేలికగా మారుతుంది. ఎక్కువగా వేయించిన ఆహార పదార్థాలు తిన్నప్పుడు ఇలా జరుగుతుంది.
2. జీర్ణక్రియ బలహీనపడటం: ఆహారం సరిగ్గా అరగనప్పుడు అందులో గాలి మరియు కొవ్వు శాతం పెరుగుతుంది. దీనివల్ల మలం యొక్క సాంద్రత (Density) తగ్గి నీటిపై తేలుతుంది. ఒకవేళ మలం తేలడంతో పాటు కడుపు ఉబ్బరంగా అనిపిస్తే వెంటనే డాక్టరును సంప్రదించాలి.
3. మలంలో కొవ్వు ఉండటం (Steatorrhea): మలంలో కొవ్వు శాతం ఎక్కువగా ఉన్నప్పుడు అది నీటిలో తేలుతుంది. మలం రంగు పల్చగా ఉండటం లేదా విపరీతమైన దుర్వాసన రావడం వంటివి జరిగితే, మీ శరీరం కొవ్వును సరిగ్గా గ్రహించడం లేదని అర్థం. ఇది లివర్ (Liver) లేదా ప్యాంక్రియాస్ (Pancreas) సమస్యలకు సంకేతం కావచ్చు.
4. ప్రేగులలో ఇన్ఫెక్షన్: కొన్నిసార్లు ‘ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్’ (IBS) వల్ల కూడా ఇలా జరుగుతుంది. మలం తేలడం అనేది ప్రేగులలో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు కూడా సూచించవచ్చు. నిరంతరం మలబద్ధకం లేదా విరేచనాలు అవ్వడం వల్ల కూడా ఈ పరిస్థితి తలెత్తవచ్చు.
5. అధిక ఫైబర్ తీసుకోవడం: ఆహారంలో ఒక్కసారిగా పీచు పదార్థం (Fiber) పెంచినప్పుడు మలంలో గాలి చేరుతుంది. దీనివల్ల కూడా అది నీటిలో తేలుతుంది. ఒకవేళ మీరు పండ్లు, సలాడ్లు లేదా ముడి ధాన్యాలు ఎక్కువగా తీసుకుంటుంటే, మీ ఆహారంలో తగిన మార్పుల కోసం నిపుణులను సంప్రదించండి.
