టీచర్‌పై విద్యార్థి ఉన్మాదం..! నడిరోడ్డుపై ఉపాధ్యాయురాలి పెదవి కోరికిన 12వ తరగతి విద్యార్థి.. సీసీటీవీలో దృశ్యాలు!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మెయిన్‌పురిలో, 12వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి తన టీచర్‌పై అత్యంత క్రూరంగా దాడి చేసి, ఆమె పెదవిని కోరికిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

అసలేం జరిగిందంటే? బాధితురాలు ఒక పాఠశాలలో టీచర్‌గా పనిచేసేవారు. అదే పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి చాలా కాలంగా ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడు. దీనిపై అతని కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేసినప్పుడు, కొద్దిరోజులు సైలెంట్‌గా ఉన్న విద్యార్థి మళ్లీ తన వేధింపులను మొదలుపెట్టాడు. దీంతో విసిగిపోయిన టీచర్, ఆ స్కూల్ నుండి తప్పుకుని వేరే స్కూల్లో చేరాలని నిర్ణయించుకున్నారు.

ఉద్యోగం వదిలేసినా వదలని విద్యార్థి: ఆమె ఉద్యోగం మానేసినా కూడా ఆ విద్యార్థి ఆమెను వెంబడించడం (Stalking) ఆపలేదు. తాజాగా, ఆమె ట్యూషన్ చెప్పడానికి వెళ్తుండగా దారిలో అడ్డగించి గొడవకు దిగాడు. ఆమె ప్రతిఘటించడంతో ఆగ్రహం చెందిన ఆ విద్యార్థి, ఆమెను బలవంతంగా లాక్కెళ్లి, గొంతు నులిమి దాడి చేశాడు. అంతటితో ఆగకుండా ఆమె రెండు పెదవులను కోరికి తీవ్రంగా గాయపరిచి అక్కడి నుండి పారిపోయాడు.

కత్తితోనూ దాడి: కేవలం కోరకడమే కాకుండా, పదునైన ఆయుధంతో ఆమె ముఖాన్ని కూడా వికృతం చేయడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. విద్యార్థి ఆమెను బలవంతంగా లాక్కెళ్తున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

రక్తపు మడుగులో ఉన్న టీచర్‌ను గమనించిన స్థానికులు మొదట జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆమెను ఆగ్రాలోని ఉన్నత ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మెయిన్‌పురి పోలీసులు ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసి విచారణ ప్రారంభించారు. గురు-శిష్యుల బంధానికి కళంకం తెచ్చేలా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది.


Posted

in

by

Tags: