నేటి కాలంలో పిల్లలు భోజనం చేసేటప్పుడు, పడుకునేటప్పుడు, చివరకు చదువుకునేటప్పుడు కూడా మొబైల్ కావాలని పట్టుబడుతున్నారు. ఈ మొబైల్ వ్యసనం (Mobile Addiction) నుండి పిల్లలను ఎలా బయటపడేయాలో తెలియక తలలు పట్టుకుంటున్న తల్లిదండ్రులకు బెంగళూరులోని నిమ్హాన్స్ (NIMHANS) ఒక ఆశాకిరణంగా నిలిచింది. పిల్లల్లో పెరుగుతున్న సోషల్ మీడియా, మొబైల్ ఫోన్ల పిచ్చిని నియంత్రించడానికి నిమ్హాన్స్లోని ‘షట్’ (SHUT – Service for Healthy Use of Technology) క్లినిక్ తల్లిదండ్రుల కోసం ప్రత్యేక ఆన్లైన్ శిక్షణను నిర్వహిస్తోంది.
శిక్షణ కార్యక్రమం వివరాలు:
తెక్నాలజీ వ్యసన నిర్వహణ కోసం పేరెంట్ గ్రూప్ (PGMTA) పేరుతో ప్రతి శనివారం ఆన్లైన్ ద్వారా తల్లిదండ్రులకు శిక్షణ ఇస్తున్నారు. జూలై 2025లో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి భారీ స్పందన లభించింది. ఇప్పటివరకు సుమారు 5,500 మందికి పైగా తల్లిదండ్రులు దీని ద్వారా లబ్ధి పొందారు.
శిక్షణ నాణ్యతను కాపాడటానికి మరియు ప్రతి తల్లిదండ్రుల సమస్యను క్షుణ్ణంగా వినడానికి, ఒక సెషన్లో కేవలం 50 నుండి 60 మందికి మాత్రమే అవకాశం కల్పిస్తామని షట్ క్లినిక్ హెడ్ డాక్టర్ మనోజ్ శర్మ తెలిపారు.
పిల్లల ప్రవర్తనలో మార్పులు – తల్లిదండ్రుల భయం:
మొబైల్ ఇవ్వకపోతే పిల్లలు మొండిగా ప్రవర్తించడం, అన్నం తిననని భీష్మించడం, చివరకు ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించడం వంటివి చేస్తున్నారని డాక్టర్ శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ భయం కారణంగానే తల్లిదండ్రులు పిల్లల చేతిలో నుండి మొబైల్ లాక్కోలేక అశక్తులవుతున్నారు.
శిక్షణలో ఏముంటుంది?
నిమ్హాన్స్ నిర్వహించే ఈ సెషన్లలో ప్రధానంగా మూడు అంశాలపై అవగాహన కల్పిస్తారు:
- సైబర్ అక్షరాస్యత (Cyber Literacy): టెక్నాలజీపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం. ప్రైవసీ సెట్టింగ్స్, డేటా భద్రత మరియు సైబర్ వేధింపుల నుండి పిల్లలను ఎలా రక్షించాలో నేర్పిస్తారు.
- ఆరోగ్యకరమైన సంభాషణ: పిల్లలపై అరవకుండా, వారితో స్నేహపూర్వకంగా ఎలా మాట్లాడాలో నేర్పిస్తారు.
- సంఘర్షణ పరిష్కారం: మొబైల్ వాడకం విషయంలో ఇంట్లో జరిగే గొడవలను శాంతియుతంగా ఎలా సర్దుబాటు చేయాలో వివరిస్తారు.
హెల్ప్‌లైన్ మరియు రిజిస్ట్రేషన్:
ఈ శిక్షణ కేవలం ఒక్కరోజుతో ముగిసేది కాదు. తల్లిదండ్రులు నోట్స్ రాసుకోవాలని, ప్రతిరోజూ దీనిని అభ్యాసం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అవసరమైతే ‘బూస్టర్ సెషన్ల’లో కూడా పాల్గొనవచ్చు.
- షట్ క్లినిక్ హెల్ప్‌లైన్ నంబర్: 094808 29670
- చిరునామా: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (NIMHANS), హోసూర్ రోడ్, బెంగళూరు – 560029.
