కేవలం 20 రూపాయల లంచం తీసుకున్నారనే ఆరోపణతో దాదాపు మూడు దశాబ్దాల పాటు న్యాయపోరాటం చేసిన ఒక వ్యక్తి, చివరకు నిర్దోషిగా తేలిన మరుసటి రోజే మరణించారు. భారతీయ నేరన్యాయ వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతున్న ఈ విషాద ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
“నా జీవితంపై పడిన మచ్చ తొలగిపోయింది. ఇప్పుడు దేవుడు నన్ను తీసుకెళ్లినా నాకు ఎలాంటి బాధా లేదు” అని ఫిబ్రవరి 4న గుజరాత్ హైకోర్టు తీర్పు వెలువరించిన తర్వాత ఆయన వ్యాఖ్యానించారు.
అసలేం జరిగింది? అహ్మదాబాద్‌లో పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బాబూభాయ్ ప్రజాపతిపై రూ. 20 లంచం తీసుకున్నారనే ఆరోపణలు రావడంతో, అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదైంది. 1997లో ఆయనపై ఛార్జ్‌షీట్ దాఖలైంది. 2004లో సెషన్స్ కోర్టు ఆయనకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ. 3,000 జరిమానా విధించింది.
సెషన్స్ కోర్టు తీర్పును ప్రజాపతి గుజరాత్ హైకోర్టులో సవాలు చేశారు. ఆ అప్పీలు గత 22 ఏళ్లుగా పెండింగ్‌లో ఉంది. చివరకు ఈ ఏడాది ఫిబ్రవరి 4న హైకోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. సాక్షుల స్టేట్మెంట్లలో వైరుధ్యాలు ఉన్నాయని, ప్రాసిక్యూషన్ ఆరోపణలను నిరూపించలేకపోయిందని కోర్టు పేర్కొంది.
తీర్పు వచ్చిన మరుసటి రోజే విషాదం: న్యాయస్థానం నుండి గెలిచి ఇంటికి వచ్చిన మరుసటి రోజే ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. “ఆయన నిన్న ఆఫీసుకి వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రభుత్వం నుండి మీకు రావాల్సిన ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకోమని చెప్పాను. కానీ మరుసటి రోజే ఆయన మరణవార్త వినాల్సి వచ్చింది” అని ప్రజాపతి తరపు న్యాయవాది నితిన్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు.
