హోంవర్క్ చేయలేదని 2వ తరగతి విద్యార్థిని కర్రతో ‘150 సార్లు’ బాదిన టీచర్

ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో హోంవర్క్ పూర్తి చేయలేదన్న కోపంతో ఒక పాఠశాల ఉపాధ్యాయుడు రెండో తరగతి విద్యార్థిని కర్రతో సుమారు 150 సార్లు కొట్టాడు. ఈ దాడిలో విద్యార్థి శరీరంపై తీవ్రమైన గాయాలయ్యాయి. దీనిపై పోలీసులు సదరు టీచర్‌పై కేసు నమోదు చేశారు.

కర్నైల్‌గంజ్ ప్రాంతంలోని ఒక పాఠశాలలో ప్రఖర్ సింగ్ (10) అనే విద్యార్థి తన ఇంగ్లీష్ హోంవర్క్ పూర్తి చేయకపోవడంతో ఉపాధ్యాయుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. బాలుడి తండ్రి ఫిర్యాదు చేస్తూ, టీచర్ తన కొడుకును కర్రతో 150 సార్లు బాదాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పిల్లాడు ఇంటికి కుంటుతూ వచ్చాడని, కాళ్లపై తీవ్రమైన వాతలు ఉన్నాయని తండ్రి పేర్కొన్నారు. అంతేకాకుండా, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే మళ్లీ కొడతానని బెదిరించి, బిస్కెట్లు ఇచ్చి నోరు నొక్కే ప్రయత్నం చేశారని ఆరోపించారు.

ఫిర్యాదు అందిన వెంటనే పాఠశాల ప్రిన్సిపాల్ స్పందిస్తూ, ఆ ఇంగ్లీష్ టీచర్‌ను వెంటనే విధుల నుండి తొలగించినట్లు తెలిపారు. భారతీయ న్యాయ సంహిత (BNS) కింద టీచర్‌పై కేసు నమోదైందని, చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు ధృవీకరించారు.

మరో ఘటన: టీచర్‌పై పాత విద్యార్థి దాడి ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురిలో మరో కిరాతక ఘటన వెలుగుచూసింది. గత మూడేళ్లుగా తనను వేధిస్తున్న అఖండ్ ప్రతాప్ (24) అనే పాత విద్యార్థి, ఒక మాజీ మహిళా టీచర్‌పై ఘోరమైన దాడికి పాల్పడ్డాడు. జనవరి 20న ఆమె ట్యూషన్ చెప్పడానికి వెళ్తుండగా దారి కాచిన నిందితుడు, ఆమెను ఒక సందులోకి లాక్కెళ్లే ప్రయత్నం చేశాడు. ఆమె ప్రతిఘటించడంతో పదునైన ఆయుధంతో ఆమె పెదవులను కోసేశాడు. ప్రస్తుతం బాధితురాలు ఆగ్రాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. నిందితుడు 12వ తరగతి చదువుతున్నప్పటి నుండి ఆమెను వేధిస్తున్నాడని, ఆ వేధింపుల భరించలేక ఆమె అప్పట్లో ఉద్యోగం కూడా వదిలేసిందని పోలీసులు తెలిపారు.


Posted

in

by

Tags: