అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్స్టీన్కు సంబంధించిన కీలక పత్రాలను విడుదల చేస్తోంది. ఈ డాక్యుమెంట్లలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖుల పేర్లు, ఫోటోలు మరియు వీడియోలు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే దలైలామా పేరు కూడా ఆ పత్రాల్లో వందకు పైగా సార్లు ప్రస్తావనకు వచ్చిందని సోషల్ మీడియాలో వార్తలు రావడంతో, దలైలామా కార్యాలయం స్పందించింది. ఆ ఆరోపణలను ప్రాథమికంగానే తోసిపుచ్చింది.
దలైలామా కార్యాలయం ప్రకటన: హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల వేదికగా దలైలామా కార్యాలయం ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది. “జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్‌లో దలైలామా పేరు ఉన్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. 14వ దలైలామా ఎప్పుడూ జెఫ్రీ ఎప్స్టీన్ను కలవలేదు. ఆయన తరపున ఎవరైనా చర్చలు జరపడానికి కూడా ఎప్పుడూ అనుమతి ఇవ్వలేదు. ఈ వార్తలు పూర్తిగా తప్పుదోవ పట్టించేవి మరియు వాస్తవ విరుద్ధమైనవి” అని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.
ఎవరీ జెఫ్రీ ఎప్స్టీన్? న్యూయార్క్‌కు చెందిన జెఫ్రీ ఎప్స్టీన్కు రాజకీయ నేతలు, సెలబ్రిటీలతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. 2005లో అతనిపై మొదటిసారి కేసు నమోదు కాగా, 2008లో జైలుకు వెళ్లాడు. 2019లో సెక్స్ ట్రాఫికింగ్ (లైంగిక అక్రమ రవాణా) కేసులో మళ్ళీ అరెస్టయ్యాడు. అయితే, పోలీసుల కస్టడీలో ఉన్నప్పుడే అతను ఆత్మహత్య చేసుకున్నాడు.
ఎప్స్టీన్ నిర్వహించే హై-ప్రొఫైల్ పార్టీల్లో సైంటిస్ట్ స్టీఫెన్ హాకింగ్, డొనాల్డ్ ట్రంప్, మైఖేల్ జాక్సన్, బిల్ క్లింటన్ వంటి దిగ్గజాల పేర్లు ఉన్నట్లు ఇప్పటివరకు వచ్చిన నివేదికలు చెబుతున్నాయి.
