కేరళలోని షోర్నూర్ సమీపంలో ఉన్న కుళప్పుళ్లి మెగా లాడ్జి కేంద్రంగా సాగుతున్న వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఇతర రాష్ట్రాల మహిళలను రప్పించి ఇక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడి చేశారు. ఈ కేసులో లాడ్జి యజమాని వల్లప్పుళ కురువట్టూర్ నెడియోడత్తుకు చెందిన బషీర్ (57)తో సహా మొత్తం 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమ బెంగాల్, అసోం, బెంగళూరుకు చెందిన యువతులను బషీర్ ఇక్కడకు రప్పించేవాడు. ఉన్నత స్థాయి వ్యక్తులతో బేరసారాలు ఆడి, యువతులను వారికి అప్పగించి లక్షల రూపాయలు వసూలు చేసేవాడు. షోర్నూర్ సి.ఐ వి. రవికుమార్ నేతృత్వంలోని పోలీసు బృందం ఈ దాడి నిర్వహించి నిందితులను పట్టుకున్నారు.
గతంలో 2013లో కూడా ఇదే లాడ్జిలో ఇలాంటి ముఠా పట్టుబడింది. ఆ కేసుకు సంబంధించిన విచారణ ప్రస్తుతం కోర్టులో సాగుతోంది. తాజాగా పట్టుబడిన నిందితులందరినీ పట్టాంబి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. ఈ ఆపరేషన్లో ఎస్.ఐ అశ్విన్, ఎ.ఎస్.ఐ సుభద్ర మరియు ఇతర సి.పి.ఓలు పాల్గొన్నారు.
