కోర్టు రూమ్‌లోనే జడ్జి ముందే లాయర్‌పై దాడి! ‘గుండా రాజ్ నడవదు’ అన్న సీజేఐ సూర్యకాంత్

న్యూఢిల్లీ: సోమవారం ఉదయం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ వద్దకు ఒక న్యాయవాది వచ్చి, ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టులో జడ్జి ముందే తనపై దాడి జరిగిందని ఫిర్యాదు చేశారు.

దీనిపై సీజేఐ స్పందిస్తూ.. కోర్టుల్లో ఇటువంటి ‘గుండా రాజ్’ (రౌడీయిజం) ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించారు. బాధితుడైన న్యాయవాదిని ముందుగా ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించాలని కోరుతూ, ఆ ఫిర్యాదు ప్రతిని తమకు కూడా సమర్పించాలని ఆదేశించారు. నిందితులపై చర్యలు తీసుకోవడానికి ఢిల్లీ పోలీసులు కూడా భయపడుతున్నారని సదరు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

జడ్జి ముందే లాయర్‌పై దాడి గత శనివారం (ఫిబ్రవరి 7, 2026) తీస్ హజారీ కోర్టులో అదనపు జిల్లా న్యాయమూర్తి హర్జీత్ సింగ్ పాల్ కోర్టులో ఒక నిందితుడి తరపున తాను వాదిస్తున్నప్పుడు ఈ ఘటన జరిగిందని ఆ న్యాయవాది సుప్రీంకోర్టుకు వివరించారు. ఫిర్యాదుదారు తరపు న్యాయవాది కొంతమంది గూండాలతో కోర్టులోకి ప్రవేశించి, జడ్జి ముందే తనను మరియు ఇతర నిందితులను కొట్టారని పేర్కొన్నారు.

తలుపులు మూసివేసి దాడి దాడి చేసిన వారు కోర్టు రూమ్ తలుపులను లోపలి నుండి గడియ పెట్టి, జడ్జి సమక్షంలోనే ఈ హింసకు పాల్పడ్డారని బాధితుడు తెలిపారు. అయితే, నేరుగా సుప్రీంకోర్టుకు ఎందుకు వచ్చారని సీజేఐ ప్రశ్నిస్తూ.. “ముందుగా ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ దృష్టికి ఈ విషయాన్ని ఎందుకు తీసుకెళ్లలేదు?” అని అడిగారు.

‘చట్టబద్ధ పాలన కుప్పకూలినట్లే’ కేవలం మీడియా దృష్టిని ఆకర్షించడానికే ఇక్కడ ప్రస్తావిస్తున్నారా? అని సీజేఐ ప్రశ్నించగా.. పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని, అందుకే సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సభ్యుడిగా మీ ముందుకు వచ్చానని ఆ లాయర్ చెప్పారు. దీనిపై సీజేఐ స్పందిస్తూ.. “దీనిని నేను పరిపాలనా పరంగా (Administrative side) పరిష్కరిస్తాను. మీరు వెళ్లి హైకోర్టు సీజేకి ఫిర్యాదు చేయండి. కోర్టుల్లో ఇలాంటి అసభ్య ప్రవర్తన ఏంటి? మాకు ఇటువంటి గుండా రాజ్ అస్సలు నచ్చదు. ఇలా జరిగితే చట్టబద్ధ పాలన (Rule of Law) కుప్పకూలినట్లే” అని హెచ్చరించారు.


Posted

in

by

Tags: