మహిళలపై అత్యాచారాలు, గర్భాశయాల తొలగింపు, చర్మంతో సహా జుట్టును పీకేయడం! ఇరాన్‌లో నిరసనలను ఆపడానికి క్రూరమైన హింస

ఇరాన్‌లో గత ఏడాది డిసెంబర్ నుండి ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. వేలాది మంది మహిళలు, పురుషులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. నిరసనలను అణచివేయడానికి ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ సాగిస్తున్న అరాచకాలు ఇప్పటికే వెలుగులోకి రాగా, ఇప్పుడు మరికొన్ని భయంకరమైన విషయాలు బయటపడ్డాయి. ముఖ్యంగా నిరసనల్లో పాల్గొంటున్న మహిళలనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు.

అమానవీయ హింస మరియు లైంగిక వేధింపులు: ఇరానియన్ సంతతికి చెందిన జర్మన్ జర్నలిస్ట్ మిచెల్ అబ్దుల్లాహి సంచలన విషయాలు బయటపెట్టారు. నిరసనలను ఆపడానికి మొదట మహిళలను అత్యాచారం చేస్తామని బెదిరించారు. కానీ మహిళలు వెనక్కి తగ్గకుండా మరింత గట్టిగా గర్జించడంతో, ప్రభుత్వం హింసను మరింత పెంచింది. భద్రతా దళాలు మహిళలను అపహరించి అత్యాచారాలు, సామూహిక అత్యాచారాలకు పాల్పడుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. మహిళల గర్భాశయాలను (Uterus) తొలగించడం, తల చర్మంతో సహా జుట్టును బలవంతంగా పీకేయడం వంటి క్రూరమైన చర్యలకు పాల్పడుతున్నారు. జర్మన్ పత్రిక ‘డై వెల్ట్’ కూడా ఈ నరమేధాన్ని తన నివేదికలో ప్రస్తావించింది.

చిన్నారులను కూడా వదిలిపెట్టడం లేదని సమాచారం. లైంగిక వేధింపులకు ఎటువంటి ఆధారాలు ఉండకూడదనే ఉద్దేశంతో అనేకమంది మహిళల మృతదేహాలను తగలబెట్టేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

అంతర్జాతీయ ఆందోళన: ఇరాన్ అత్యున్నత నాయకుడు ఆయతొల్లా అలీ ఖమేనీ నిరసనకారులను ‘కనిపిస్తే కాల్చివేయండి’ అని ఆదేశించినట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. ద్రవ్యోల్బణం, పరిపాలనా వైఫల్యం మరియు కఠినమైన మతపరమైన పాలనకు వ్యతిరేకంగా సాగుతున్న ఈ పోరులో మరణించిన వారి సంఖ్య 3,000 నుండి 16,000 వరకు ఉండవచ్చని వేర్వేరు నివేదికలు చెబుతున్నాయి. ఈ పరిణామాల పట్ల అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.


Posted

in

by

Tags: