దుబాయ్: దుబాయ్‌లో ఉంటున్న తన బంధువుల ఇంటికి వెళ్లిన కామిని కన్నన్ అనే భారతీయ మహిళ, పొరపాటున బంగారు నాణేలు ఉన్న బ్యాగును చెత్తబుట్టలో పడేశారు. ఇక ఆ నగలు దొరకవు అని ఆమె ఎంతో ఆవేదన చెందారు. కానీ, ఆమె కలలో కూడా ఊహించని ఒక అద్భుతం జరిగింది.
అసలేం జరిగిందంటే?
కామిని కన్నన్ 2021 వరకు దుబాయ్‌లో నివసించి, ఆ తర్వాత ఇండియాకు తిరిగి వచ్చారు. ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఒక వివాహ వేడుకకు హాజరయ్యేందుకు ఆమె మళ్లీ అక్కడికి వెళ్లారు. ఆమె వద్ద ఒక చిన్న బ్యాగులో 8 గ్రాముల 22 క్యారెట్ల బంగారు నాణెం, 50 గ్రాముల బంగారు బిస్కెట్ ఉన్నాయి.
ఆ బంగారం ఉన్న పాత బ్యాగు కాస్త చిరిగిపోవడంతో, ఆమె వాటిని ఒక కొత్త చిన్న బ్యాగులో వేసి డైనింగ్ టేబుల్‌పై ఉంచారు. అయితే, అదే రోజు సాయంత్రం ఇల్లు శుభ్రం చేస్తున్న ఆమె కుమారుడు అభిమన్యు, టేబుల్‌పై ఉన్న ఆ చిన్న బ్యాగును చెత్త అని భావించి పొరపాటున చెత్తబుట్టలో పడేశాడు.
₹12.35 లక్షల విలువైన బంగారం
ఫిబ్రవరి 2న కామిని ఇండియాకు తిరిగి రావాల్సి ఉంది. అయితే ఫిబ్రవరి 1న బంగారం కనిపించడం లేదని ఆమెకు తెలిసింది. అది పొరపాటున చెత్తలో వెళ్ళిపోయిందని గ్రహించిన ఆమె, ఇక అది దొరకదని ఆశలు వదులుకున్నారు. అయినా ఒక మాట చెప్పి ఉంచుదామని బిల్డింగ్ సెక్యూరిటీ గార్డుకు ఆ విషయాన్ని వివరించారు. తమదే తప్పు కాబట్టి పోలీసులు కూడా ఏమీ చేయలేరని భావించి వారు కనీసం ఫిర్యాదు కూడా చేయలేదు.
కానీ, మూడు రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 4న, సెక్యూరిటీ గార్డ్ నుండి అభిమన్యుకు ఫోన్ వచ్చింది. ఎవరో పోలీసులు వచ్చి మీ బంగారం గురించి అడుగుతున్నారని ఆయన చెప్పడంతో వారు ఆశ్చర్యపోయారు.
పోలీసుల నిజాయితీ.. టెక్నాలజీ మ్యాజిక్
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. చెత్త సేకరించే వ్యక్తికి ఆ బంగారం దొరికింది. అతను దానిని తీసుకుని ఒక బంగారు దుకాణానికి అమ్మడానికి వెళ్ళాడు. అక్కడ పోలీసులు అతడిని విచారించగా, అది తనకు చెత్తలో దొరికిందని చెప్పాడు.
వెంటనే దుబాయ్ పోలీసులు ఆ బంగారం ఎక్కడి నుండి వచ్చిందో ఆరా తీశారు. దుబాయ్‌లో వ్యర్థాల నిర్వహణ (Waste Management) ఎంత అత్యాధునికంగా ఉందంటే.. ఏ చెత్త సంచి ఏ బిల్డింగ్‌లోని ఏ ఫ్లాట్ నుండి వచ్చిందో కూడా ట్రాక్ చేసే వీలుందట. ఆ టెక్నాలజీ సాయంతో పోలీసులు నేరుగా అభిమన్యు ఉంటున్న బిల్డింగ్‌కు చేరుకున్నారు.
మరుసటి రోజు బంగారం కొన్న పత్రాలతో పోలీస్ స్టేషన్‌కు రమ్మని పోలీసులు కోరారు. అన్ని ఆధారాలు చూపించడంతో ఆ బంగారాన్ని వారికి అప్పగించారు. దీంతో ఆ కుటుంబం సంతోషానికి అవధులు లేవు.
