విశ్వాసం, ప్రేమతో నిండిన ఒక కుటుంబంలో అక్రమ సంబంధం అనే విషం కలిస్తే, కేవలం బంధాలే కాదు, ఎందరో మనుషుల జీవితాలు నాశనమవుతాయి. తనను ప్రాణంగా ప్రేమించే భర్తను, తన సుఖం కోసం మరొకరి కోసం నిష్కరుణగా అంతం చేసే వార్తలు నేడు సమాజంలో నిత్యకృత్యమవుతున్నాయి. ఇడుక్కి జిల్లా శాంతన్పారాలో జరిగిన ఈ ఘటన అటువంటి కోవకే చెందుతుంది.
కథనం: కేరళ ఇడుక్కి శాంతన్పారాకు చెందిన రిజోష్, లిజి దంపతులకు మూడేళ్ల కుమార్తె జోవానా ఉంది. లిజి ఒక ఫామ్ హౌస్‌లో పని చేసేది. అక్కడ మేనేజర్‌గా ఉన్న వసీం అనే వ్యక్తితో ఆమెకు అక్రమ సంబంధం ఏర్పడింది. తమ బంధానికి రిజోష్ అడ్డుగా ఉన్నాడని భావించిన వసీం, లిజి అతడిని హతమార్చాలని నిర్ణయించుకున్నారు.
హత్య జరిగిన తీరు: అక్టోబర్ 31న వసీం తన స్నేహితుడైన రిజోష్ను ఫామ్ హౌస్‌కు పిలిచాడు. అక్కడ మద్యం లో మత్తుమందు కలిపి రిజోష్ స్పృహ కోల్పోయేలా చేసి, ఆపై కిరాతకంగా చంపేశారు. శవాన్ని కాల్చివేయాలని ప్రయత్నించినా, వర్షం కారణంగా అది సాధ్యపడలేదు. చివరకు జేసీబీతో గొయ్యి తీసి సగం కాలిన మృతదేహాన్ని పూడ్చిపెట్టారు.
మరుసటి రోజు ఏమీ తెలియనట్లు నటించిన లిజి, తన భర్త గొడవ పడి ఎర్నాకుళం వెళ్లిపోయాడని అబద్ధం చెప్పింది. అయితే పోలీసుల విచారణలో లిజి, వసీంల అక్రమ సంబంధం బయటపడింది. పోలీస్ డాగ్ ఫామ్ హౌస్‌లో రిజోష్ మృతదేహాన్ని గుర్తించింది.
చిన్నారి హత్య: పోలీసులకు దొరికిపోతామని భయపడిన లిజి, వసీం తమ మూడేళ్ల కుమార్తె జోవానాతో కలిసి ముంబైకి పారిపోయారు. అక్కడ పోలీసులకు చిక్కుతామని తెలిసినప్పుడు, ఆ తల్లి మరో దారుణానికి ఒడిగట్టింది. తన కన్నకూతురికి విషమిచ్చి చంపేసింది. ఆపై లిజి, వసీం కూడా విషం తాగినప్పటికీ ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఆ ఇద్దరూ జైలు శిక్ష అనుభవిస్తున్నారు.
