మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా? బరువు తగ్గడానికి ఎన్ని దారులు వెతికినా ఫలితం లేదా? అయితే ముందుగా మీ ఆహారపు అలవాట్లను మార్చుకోండి. ఎందుకంటే మనం తినే ఆహారమే బరువు పెరగడానికి ప్రధాన కారణం. సరైన ఆహారాన్ని ఎంచుకుంటే త్వరలోనే మంచి ఫలితం కనిపిస్తుంది.
శరీర బరువును వేగంగా తగ్గించుకోవాలంటే, అల్పాహారంగా (Breakfast) సిరిధాన్యాల గంజి ఒక అద్భుతమైన ఎంపిక. ముఖ్యంగా ఊదలు (Barnyard Millet) మరియు పెసరపప్పుతో చేసిన గంజి తాగడం వల్ల బరువులో పెద్ద మార్పు కనిపిస్తుంది. ఇందులో కేలరీలు చాలా తక్కువ. ఒక కప్పు గంజి తాగితే కడుపు నిండుగా అనిపించి, ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది.
కావలసిన పదార్థాలు:
- ఊదలు ( Barnyard Millet) – 3/4 కప్పు
- పెసరపప్పు – 1 కప్పు
- వెల్లుల్లి – 5 రెబ్బలు
- మెంతులు – 1/2 టీస్పూన్
- ఉప్పు – రుచికి సరిపడా
- నీళ్లు – 5 కప్పులు (అవసరమైన మేర)
- పచ్చి కొబ్బరి తురుము – ఒక గుప్పెడు
తయారీ విధానం:
- పెసరపప్పును ముందు రోజే రాత్రి నానబెట్టుకోవాలి.
- ఉదయాన్నే ఊదలు (మిల్లెట్స్) 4 సార్లు శుభ్రంగా కడిగి కుక్కర్లో వేయాలి.
- అందులో నానబెట్టిన పెసరపప్పు, వెల్లుల్లి, మెంతులు మరియు 5 కప్పుల నీళ్లు పోయాలి.
- తగినంత ఉప్పు వేసి కలిపి, కుక్కర్ మూత పెట్టి 7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
- ప్రెజర్ పోయాక మూత తీసి బాగా కలపాలి. గంజి మరీ చిక్కగా అనిపిస్తే మరికొన్ని నీళ్లు కలుపుకోవచ్చు.
- చివరగా పచ్చి కొబ్బరి తురుము వేసి కలుపుకుంటే రుచికరమైన ఆరోగ్యకరమైన గంజి సిద్ధం!
