భారతదేశంలో నివసిస్తున్న ఆస్ట్రేలియా యువకుడు ఆండీ ఎవాన్స్, భారతీయ విమాన ప్రయాణికుల అచంచలమైన నిద్రను చూసి విస్మయానికి గురవుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఏం జరిగింది? ఇటీవల ఇండియాలో విమాన ప్రయాణం చేసిన ఆండీకి ఒక వింత అనుభవం ఎదురైంది. విమానం ల్యాండింగ్ (Landing) అయ్యే సమయంలో భూకంపం వచ్చినట్లుగా విమానం విపరీతంగా అదురుతోంది. ఆ భయంకరమైన కుదుపులకు ఆండీ వణికిపోతూ తన సీటును గట్టిగా పట్టుకుని కూర్చున్నాడు.
కానీ, అతని పక్కనే ఉన్న ‘నితిన్ జీ’ అనే పెద్దాయనతో పాటు చాలా మంది భారతీయ ప్రయాణికులు ఆ శబ్దాల మధ్య, కుదుపుల మధ్య ఏమాత్రం పట్టించుకోకుండా హాయిగా గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. ఇది చూసిన ఆండీకి నోట మాట రాలేదు.
ఆండీ స్పందన: “భారతీయులకు ఎక్కడైనా, ఏ సమయంలోనైనా నిద్రపోయే అపూర్వ శక్తి ఉంది. నాకూ ఎవరైనా ఈ విద్యను నేర్పించండి” అంటూ అతను సరదాగా తన ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చాడు.
నెటిజన్ల కామెంట్స్: ఈ వీడియో చూసిన ఇండియన్ నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. “మేమంతా ఇండియన్ రైల్వేలో ప్రయాణించి ఆ కుదుపులకే అలవాటు పడిపోయాం, ఈ చిన్నపాటి వైబ్రేషన్స్ మాకేం లెక్క కాదు” అని కొందరు, “ఫ్లైట్ ఆగగానే చూడండి.. అదే నితిన్ జీ అందరికంటే ముందు లేచి లగేజ్ తీసుకోవడానికి క్యూలో నిలబడతారు” అని మరికొందరు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
