వారణాసి హోటల్‌లో బస చేసిన హైదరాబాద్ తోబుట్టువుల ఆత్మహత్య; బ్యాగులో లభించిన రూ. 6.5 లక్షల నగదు

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి కాంట్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఒక హోటల్‌లో బస చేసిన హైదరాబాద్‌కు చెందిన అన్నాచెల్లెళ్లు మంగళవారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నారు. వారి మృతదేహాలు గదిలోని నేలపై ఉన్న పరుపుపై లభించాయి. హోటల్‌లో సమర్పించిన ఆధార్ కార్డుల ఆధారంగా వారిని తోబుట్టువులుగా గుర్తించారు.

పోలీసులకు వారి బ్యాగులో సుమారు రూ. 6,61,000 నగదు, ఆధార్ కార్డులు, ల్యాప్‌టాప్, పాన్‌కార్డ్ మరియు పాస్‌పోర్ట్‌లు లభించాయి. హోటల్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ (సికింద్రాబాద్, సీతాఫల్‌మండి) కి చెందిన 46 ఏళ్ల గణేష్ గౌడ్ గుండ్లపల్లి మరియు అతని సోదరి 38 ఏళ్ల ధనలక్ష్మి గుండ్లపల్లి ఫిబ్రవరి 8 నుండి హోటల్‌లోని రూమ్ నంబర్ 2005లో ఉంటున్నారు. వారు మంగళవారం ఉదయం చెక్-అవుట్ చేయాల్సి ఉంది.

మధ్యాహ్నం వరకు గది నుండి ఎలాంటి శబ్దం రాకపోవడంతో హోటల్ సిబ్బంది ఫోన్ చేశారు. ఎన్నిసార్లు చేసినా స్పందన లేకపోవడంతో సిగ్రా పోలీసులకు సమాచారం అందించారు. ఫోరెన్సిక్ బృందంతో కలిసి వచ్చిన పోలీసులు తలుపులు పగులగొట్టి చూడగా, ఇద్దరూ విగతజీవులై పడి ఉన్నారు. ధనలక్ష్మి నోటి వెంట నురగ వచ్చి ఉంది. టేబుల్‌పై మందు బిళ్లలు, వాటర్ బాటిళ్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. నిద్రమాత్రలు అధిక మోతాదులో తీసుకోవడం వల్లే వారు మరణించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

వారి బ్యాగులో ఒక మరణ ధృవీకరణ పత్రం (Death Certificate) కూడా లభించింది. వారి మరో సోదరి అమలాదేవి ఈ ఏడాది జనవరి 28న మరణించినట్లు అందులో ఉంది. అయితే, ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్‌లో వారు 2018 నుండి నివసించడం లేదని ప్రాథమిక విచారణలో తేలింది.


Posted

in

by

Tags: