బెంగళూరులోని ఒక పేరున్న హోటల్లో మసాజ్ సెషన్ జరుగుతున్న సమయంలో కెనడాకు చెందిన మహిళపై లైంగిక వేధింపులు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. థెరపిస్ట్ ప్రవర్తన వల్ల తాను తీవ్ర అసౌకర్యానికి గురయ్యానని బాధితురాలు పేర్కొన్నారు. అంతేకాకుండా, హోటల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా వారు దీనిని సీరియస్గా తీసుకోలేదని ఆమె ఆరోపించారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే: కర్ణాటక రాజధాని బెంగళూరులోని విధాన సౌధ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక ప్రముఖ హోటల్లో ఈ ఘటన జరిగింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం, హోటల్ స్పా సెంటర్లో మసాజ్ చేస్తున్న సమయంలో థెరపిస్ట్ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా, ఆమె అర్ధనగ్నంగా ఉన్న సమయంలో గది తలుపులు తెరిచాడు. ఈ అనుభవం తనకు తీవ్ర మానసిక క్షోభను మిగిల్చిందని ఆమె వాపోయారు.
యాజమాన్యం నిర్లక్ష్యం: బాధితురాలు వెంటనే హోటల్ మేనేజ్మెంట్కు ఫిర్యాదు చేశారు. తాను మసాజ్ కోసం చెల్లించిన రూ. 10,000లో వారు రూ. 7,000 తిరిగి ఇచ్చి, విషయాన్ని బయటకు పొక్కనివ్వకుండా నోరు మూయాలని సూచించినట్లు ఆమె ఆరోపించారు. హోటల్ సిబ్బంది తీరుతో విసిగిపోయిన ఆమె విధాన సౌధ పోలీసులను ఆశ్రయించారు.
