గ్వాలియర్‌లోని భితర్వార్కు చెందిన ఒక భావోద్వేగపూరిత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోర్టు తీర్పు ప్రకారం ఒక పసిబిడ్డను అతని తల్లికి అప్పగిస్తున్న సమయంలో, ఆ బాలుడు తన తండ్రిని వదలలేక ఏడుస్తున్న దృశ్యాలు నెటిజన్ల మనసులను కలిచివేస్తున్నాయి.
అసలేం జరిగింది? నివేదికల ప్రకారం, సోంప్రీత్ కౌర్ అనే మహిళ తన అత్తవారింటి నుండి అదృశ్యమై, తన చిన్నబిడ్డను అక్కడే వదిలేసింది. ఎనిమిది రోజుల తర్వాత పోలీసులు ఆమెను పంజాబ్‌లోని ఒక గురుద్వారాలో గుర్తించారు. ఆ తర్వాత ఆమె తన అత్తవారిపై వేధింపుల ఆరోపణలు చేస్తూ, విడాకులు తీసుకుని పుట్టింటికి వెళ్తానని స్పష్టం చేసింది. ఇరు కుటుంబాల మధ్య జరిగిన చర్చల అనంతరం విడిపోవడానికి అంగీకారం కుదిరింది. ఒప్పందంలో భాగంగా బిడ్డను తల్లికి అప్పగించాలని నిర్ణయించారు.
ఆ హృదయ విదారక క్షణం: వైరల్ వీడియోలో.. తండ్రి తన కొడుకును గట్టిగా హత్తుకుని ఉండటం కనిపిస్తుంది. తల్లి బిడ్డను తీసుకోవడానికి చేతులు చాపగానే, ఆ బాలుడు ముఖం తిప్పుకుని తండ్రిని మరింత గట్టిగా పట్టుకున్నాడు. తల్లి బలవంతంగా బిడ్డను తన వైపుకు లాక్కుంటున్నప్పుడు, ఆ చిన్నారి తండ్రి వైపు చేతులు చాస్తూ గట్టిగా ఏడవడం చూసేవారికి కన్నీళ్లు తెప్పిస్తోంది. పక్కనే ఉన్న బిడ్డ తాతయ్య తన కన్నీళ్లను ఆపుకోలేక తల్లడిల్లిపోవడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. చివరికి తల్లి ఏడుస్తున్న బిడ్డను తీసుకుని వెళ్లగా, తండ్రి నిశ్చేష్టుడై నిలబడిపోయాడు.
