ఆయుర్వేద ఔషధాల విక్రయాలు 2025 నాటికి 46 బిలియన్ డాలర్లకు, 2030 నాటికి 50 బిలియన్ డాలర్లకు చేరుతాయని అంచనా. ఈ మందుల తయారీకి అవసరమైన మెజారిటీ మూలికలను ఒకే ఒక్క కొండ అందిస్తోందంటే నమ్మగలరా? అది నిజం. ఆ కొండలే ఒడిశాలోని చారిత్రాత్మక “గంధమర్ధన్ కొండలు” (Gandhamardan Hills).
ఆయుర్వేద స్వర్గం: “ప్రకృతి వైద్యశాల” మరియు “ఆయుర్వేద స్వర్గం” అని పిలువబడే గంధమర్ధన్ కొండల శ్రేణికి “జీవవైవిధ్య వారసత్వ ప్రదేశం” (Biodiversity Heritage Site) అనే గుర్తింపు ఉంది. ఒడిశాలోని బార్గర్ మరియు బలంగీర్ జిల్లాల్లో విస్తరించి ఉన్న ఈ కొండలు దట్టమైన అడవులు, ఔషధ మొక్కలు మరియు పురాతన ఆలయాలకు నిలయం.
రామాయణ గాథ: రామాయణ పురాణం ప్రకారం, లక్ష్మణుడికి సంజీవని చికిత్స అందించడానికి హనుమంతుడు హిమాలయాల నుండి మొత్తం గంధమర్ధన్ పర్వతాన్ని మోసుకెళ్తున్నప్పుడు, ఆ పర్వతం నుండి కొన్ని భాగాలు విరిగి కింద పడ్డాయని.. అవే నేటి ఔషధ గుణాలున్న గంధమర్ధన్ కొండలని భక్తుల నమ్మకం.
జీవవైవిధ్యం మరియు పర్యాటకం: ఈ పర్వత శ్రేణి సముద్ర మట్టానికి 600 నుండి 1,005 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ 1,500 కంటే ఎక్కువ వృక్ష జాతులు మరియు 500 రకాల జంతు జాతులు ఉన్నాయి.
- నృసింగనాథ్ ఆలయం: కొండ ఉత్తర భాగంలో 14వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయం విష్ణు అవతారమైన నృసింహస్వామికి అంకితం చేయబడింది.
- హరిశంకర్ ఆలయం: దక్షిణ భాగంలో ఉన్న ఈ ఆలయం విష్ణువు (హరి) మరియు శివుడు (శంకర్) ఇద్దరికీ అంకితం చేయబడింది. ఇక్కడి సహజ సిద్ధమైన జలపాతాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి.
ఔషధాల గని: ఇక్కడ 400 కంటే ఎక్కువ అరుదైన ఔషధ మొక్కలు పెరుగుతాయి. ముఖ్యంగా మధుమేహం, పైల్స్, జీర్ణ సమస్యలు, రోగనిరోధక శక్తి పెంపుదల, స్త్రీల సమస్యలు, పాముకాటు విషానికి విరుగుడు మరియు క్షయ వ్యాధిని నయం చేసే మూలికలు ఇక్కడ లభిస్తాయి.
