చాలా మందికి ఇంజక్షన్ అంటేనే భయం. డాక్టర్ సిరంజిలో మందు నింపిన తర్వాత, దాని నుండి రెండు మూడు చుక్కల మందును బయటకు చిమ్మడం మీరు గమనించే ఉంటారు. అలా ఎందుకు చేస్తారో తెలుసా? సిరంజిలో ఉన్న గాలి బుడగలను బయటకు పంపడానికే డాక్టర్లు అలా చేస్తారు. ఒకవేళ పొరపాటున ఆ గాలి బుడగ శరీరంలోకి వెళ్తే మనిషి చనిపోతాడనే ఒక బలమైన నమ్మకం సమాజంలో ఉంది. అయితే ఇది నిజమా? లేక కేవలం అపోహనా?
ఎయిర్ ఎంబోలిజం (Air Embolism) అంటే ఏమిటి? హెల్త్‌లైన్ నివేదిక ప్రకారం, రక్తనాళాల్లోకి గాలి బుడగలు ప్రవేశించడాన్ని ‘ఎయిర్ ఎంబోలిజం’ అంటారు. ఈ గాలి బుడగలు గుండె, ఊపిరితిత్తులు లేదా మెదడుకు వెళ్లే రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటే, ఆయా అవయవాలకు అందాల్సిన ఆక్సిజన్ సరఫరా నిలిచిపోతుంది. అందుకే వైద్యులు ముందుజాగ్రత్తగా సిరంజిలోని గాలిని తీసివేస్తారు.
నిజంగా ప్రాణం పోతుందా? వైద్య నిపుణుల ప్రకారం, కొద్దిపాటి గాలి శరీరంలోకి వెళ్తే భయపడాల్సిన అవసరం లేదు. చాలా సందర్భాల్లో చిన్న చిన్న గాలి బుడగలు కండరాల్లోకి లేదా రక్తనాళాల్లోకి వెళ్తే, శరీరం వాటిని గ్రహించి సహజంగానే నాశనం చేస్తుంది. గాలి పరిమాణం ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే అది ప్రాణాపాయానికి దారితీస్తుంది. చిన్న బుడగ వల్ల ఇంజక్షన్ ఇచ్చిన చోట స్వల్పంగా నొప్పి కలగవచ్చు.
ఎంత గాలి ప్రమాదకరం? సుమారు 50 నుండి 100 మిల్లీలీటర్ల (ml) గాలి నేరుగా రక్తనాళాల్లోకి వెళ్తేనే ప్రాణాపాయం సంభవిస్తుంది. మనం సాధారణంగా తీసుకునే ఇంజక్షన్లలో అంత గాలి ఉండదు. కాబట్టి చిన్న గాలి బుడగ వెళ్లినా మన శరీరంలోని సహజ రక్త ప్రసరణ వ్యవస్థ దానిని సులభంగా తొలగిస్తుంది.
