చెన్నై: నటుడు ధనుష్‌కు ప్రముఖ నిర్మాణ సంస్థ ‘తేనాండాళ్ ఫిల్మ్స్’ షాక్ ఇచ్చింది. తమకు వాటిల్లిన రూ. 20 కోట్ల నష్టాన్ని భర్తీ చేయాలని కోరుతూ ధనుష్‌కు లీగల్ నోటీసులు పంపడం ఇప్పుడు కోలీవుడ్‌లో కలకలం రేపుతోంది.
తమిళ సినిమాలే కాకుండా హిందీ, హాలీవుడ్ వరకు తన సత్తా చాటుతున్న ధనుష్.. నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా రాణిస్తున్నారు. అయితే, గతంలో చేసుకున్న ఒక ఒప్పందం ఇప్పుడు ఆయనకు ఇబ్బందిగా మారింది.
వివాదం ఏమిటి? 2016లో ‘నాన్ రుద్రన్’ అనే సినిమా కోసం ధనుష్ ఒప్పందం చేసుకున్నారు. అయితే, ఆ సినిమాకు బదులుగా మరో సినిమాను నటించి, దర్శకత్వం వహించి ఇస్తానని ధనుష్ హామీ ఇచ్చారు. దీనికి అంగీకరించిన తేనాండాళ్ ఫిల్మ్స్.. ధనుష్‌తో పాటు ఆ సినిమాలో నటించాల్సిన నాగార్జున, ఎస్.జె. సూర్య వంటి నటులకు అడ్వాన్స్‌లు, ఇతర ఖర్చుల కోసం సుమారు రూ. 20 కోట్ల వరకు ఖర్చు చేసింది. కానీ, ధనుష్ పూర్తి స్థాయి కథను (Script) అందించలేదని ఆరోపిస్తున్నారు.
ఈ సినిమా పనులు పూర్తి చేయకుండా ధనుష్ ఇతర సినిమాలకు కాల్షీట్లు ఇవ్వడం వల్ల ఈ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయిందని తేనాండాళ్ ఫిల్మ్స్ పేర్కొంది. ఈ మేరకు వారి తరపు న్యాయవాది ఎ. చిదంబరం ధనుష్‌కు నోటీసులు పంపారు.
నోటీసులో ఏముంది? 2025 చివరి నాటికి కాల్షీట్లు ఇస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, దీనిపై వెంటనే నిర్ణయాన్ని తెలపాలని నోటీసులో పేర్కొన్నారు. ఒకవేళ కాల్షీట్లు ఇవ్వని పక్షంలో, తాము ఖర్చు చేసిన రూ. 20 కోట్లతో పాటు, అదనంగా రూ. 1 కోటి నష్టపరిహారంగా చెల్లించాలని కోరారు. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
