ఢిల్లీ యూనివర్సిటీ: ఢిల్లీ యూనివర్సిటీ నార్త్ క్యాంపస్ ఒక హింసాత్మక రణరంగంగా మారింది. UGC నిబంధనలకు మద్దతుగా నిరసన తెలుపుతున్న ఆందోళనకారుల గుంపు, రుచి తివారీ అనే మహిళా యూట్యూబర్‌పై ప్రాణాంతక దాడికి పాల్పడింది. కేవలం ఆమె కులం పేరు తెలిసిన వెంటనే గుంపు ఒక్కసారిగా రెచ్చిపోయి, ఆమెను చుట్టుముట్టి కొట్టడమే కాకుండా, బట్టలు చింపివేసేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
‘ఇది బ్రాహ్మణురాలు, పట్టుకోండి’: ద్వేషపూరిత నినాదాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం.. ఆర్ట్స్ ఫ్యాకల్టీ వెలుపల రుచి తివారీని వందలాది మంది పురుషులు, మహిళలు చుట్టుముట్టారు. నిరసనకారులకు ఆమె ఇంటిపేరు ‘తివారీ’ అని తెలియగానే, “ఇది బ్రాహ్మణురాలు, దీన్ని పట్టుకోండి”, “కొట్టండి, అప్పుడే బుద్ధి వస్తుంది” అంటూ నినాదాలు చేశారు. “ఎవరూ మాట్లాడకండి, లేదంటే నరికి పారేస్తాం” అని కూడా బెదిరించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
రుచి తివారీ ఆవేదన: దాడి తర్వాత రుచి తివారీ ఒక వీడియో విడుదల చేస్తూ తన బాధను పంచుకున్నారు. “నేను అక్కడ ఒక రిపోర్టర్‌తో మాట్లాడుతుండగా, 100-150 మంది నన్ను చుట్టుముట్టారు. నా గొంతు నొక్కారు, జుట్టు పట్టుకుని లాగారు మరియు నా బట్టలు చింపేశారు. నన్ను వివస్త్రను చేయమని వారు అరుస్తున్నారు” అని ఆమె ఆరోపించారు. అక్కడ ఉన్న వారెవరూ తనను కాపాడలేదని, ఇదేనా మీ మహిళావాదం (Feminism)? అని ఆమె ప్రశ్నించారు.
రాజకీయ విమర్శలు: ఈ ఘటనపై ఏబీవీపీ (ABVP) స్పందిస్తూ.. వామపక్ష విద్యార్థి సంఘాలైన SFI, AISA కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించింది. ఒక మహిళా జర్నలిస్ట్ అడిగే ప్రశ్నలు నచ్చక ఆమెపై దాడి చేయడం వారి మహిళా వ్యతిరేక ముఖాన్ని బయటపెట్టిందని ఏబీవీపీ విమర్శించింది. బాధితురాలు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నిరసన ఎందుకు? UGC రెగ్యులేషన్ 2026కు సంబంధించి ఈ వివాదం నడుస్తోంది. క్యాంపస్‌లలో కుల వివక్షను నిరోధించేందుకు UGC తెచ్చిన కొత్త నిబంధనలపై సుప్రీంకోర్టు జనవరి 29, 2026న స్టే విధించింది. ఈ స్టేను వ్యతిరేకిస్తూ, నిబంధనలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష సంఘాలు చేసిన నిరసన హింసాత్మకంగా మారింది.
