బెంగళూరులో హృదయ విదారక ప్రమాదం: 160 కి.మీ వేగంతో కారు నడిపిన 17 ఏళ్ల బాలుడు; ఏడుగురు మృతి!

బెంగళూరు గ్రామీణ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఏడు నిండు ప్రాణాలను బలితీసుకుంది. గంటకు 150-160 కి.మీ వేగంతో దూసుకొచ్చిన ఒక ఎస్‌యూవీ (SUV) మొదట బైక్‌ను ఢీకొట్టి, ఆపై ఎదురుగా వెళ్తున్న ట్రక్కులోకి దూసుకెళ్లింది.

ఈ ప్రమాదం జరిగిన కొద్ది నిమిషాల్లోనే మరికొన్ని వాహనాలు కూడా ఒకదానికొకటి ఢీకొన్నాయి. మరణించిన ఏడుగురిలో ఆరుగురు విద్యార్థులు ఉన్నారు. కారు నడుపుతున్న బాలుడు అతి వేగం వల్ల నియంత్రణ కోల్పోవడమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.

ఘటన వివరాలు: హోస్కోట్ తాలూకాలోని కంబలిపుర గేట్ వద్ద తెల్లవారుజామున 4:15 నుండి 4:30 గంటల మధ్య ఈ ప్రమాదం జరిగింది. 17 ఏళ్ల అయాన్ అనే బాలుడు XUV 700 కారును అతివేగంగా నడుపుతున్నాడు. రోడ్డుపై గరిష్ట వేగ పరిమితి 100 కి.మీ ఉండగా, ఆ కారు 160 కి.మీ వేగంతో ప్రయాణించింది. ముందుగా గగన్ (26) అనే బైక్ సవారీని ఢీకొట్టిన కారు, ఆపై ట్రక్కు వెనుక భాగాన్ని బలంగా ఢీకొట్టింది.

ఏడుగురు ప్రాణాలు గాల్లోకి: ఈ భీకర ప్రమాదంలో బైక్ సవారీ గగన్‌తో పాటు ఎస్‌యూవీలో ఉన్న ఆరుగురు విద్యార్థులు మరణించారు. మృతులను అహ్రం షరీఫ్ (16), అశ్విన్ నాయర్ (17), ఈథన్ జార్జ్ (17), అయాన్ అలీ (17), భరత్ (17), మరియు మహమ్మద్ ఫర్హాన్ షేక్ (18)గా గుర్తించారు. కారు ఏ స్థాయిలో నుజ్జునుజ్జయ్యిందంటే.. అది ఏ రకమైన కారో గుర్తించడం కూడా కష్టమైందని పోలీసులు తెలిపారు.


Posted

in

by

Tags: