భూమికి అడుగున కొత్త ప్రపంచం… గుహ లోపల ఒక దట్టమైన అడవి; ఏడాదికి 1000 మందికి మాత్రమే అనుమతి!

వియత్నాంలోని క్వాంగ్ బిన్ ప్రావిన్స్‌లో, లావోస్ సరిహద్దుకు సమీపంలో ‘సన్ డూంగ్’ (Son Doong) అనే గుహ ఉంది. 1991లో ఒక స్థానిక రైతు అడవిలో వెళ్తుండగా, రెండు కొండల మధ్య ఒక గుహ ద్వారాన్ని కనుగొన్నాడు. ఆ గుహ నుండి చల్లని గాలి రావడం, లోపల నది ప్రవహిస్తున్న శబ్దం వినిపించడంతో భయపడిన అతను లోపలికి వెళ్లలేకపోయాడు.

ఆ రైతు ఈ విషయం గురించి గ్రామస్తులకు చెప్పినప్పటికీ, ఎవరికీ లోపలికి వెళ్లే ధైర్యం సరిపోలేదు. చివరకు 2009లో బ్రిటీష్ అన్వేషకులు (Explorers) ఆ గుహలోకి వెళ్లి చూసి ఆశ్చర్యపోయారు. అది ఒక విభిన్నమైన ప్రపంచంలా ఉంది. ఈ గుహ దాదాపు 9 కిలోమీటర్ల పొడవు, 200 మీటర్ల ఎత్తులో ఉంది.

గుహ విశేషాలు: ఈ గుహ లోపల సొంతంగా ఒక అడవి, నది మరియు మేఘాలు కూడా ఏర్పడి ఉన్నాయి. అక్కడి వాతావరణం చాలా విభిన్నంగా ఉంటుంది. ప్రపంచంలో మరెక్కడా లేని మొక్కలు, జీవులు ఈ గుహలో కనిపిస్తాయి. ప్రస్తుతం ఇది ఒక పర్యాటక ప్రాంతంగా మారింది. అయితే, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఏటా కేవలం ఎంపిక చేసిన 1000 మందిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు.

‘ఆక్సాలిస్ అడ్వెంచర్ టూర్స్’ (Oxalis Adventure Tours) అనే సంస్థకు మాత్రమే ఇక్కడ పర్యటనలు నిర్వహించే అనుమతి ఉంది. ఇప్పటివరకు ప్రపంచంలో కనుగొనబడిన అతిపెద్ద గుహ ఇదే. సుమారు 50 లక్షల ఏళ్ల క్రితం కొండ అడుగున ప్రవహించిన నది వల్ల సున్నపురాయి కొట్టుకుపోయి ఈ భారీ గుహ ఏర్పడిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.


Posted

in

by

Tags: