సాకేత్ శ్రీనివాసయ్య: కర్ణాటకకు చెందిన 22 ఏళ్ల ప్రతిభావంతుడైన విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య మరణవార్త దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఐఐటి మద్రాస్ నుండి బీటెక్ పూర్తి చేసి, కాలిఫోర్నియా బర్క్లీ యూనివర్సిటీలో పైచదువులు చదువుతున్న సాకేత్ ఆరు రోజుల క్రితం కనిపించకుండా పోయాడు. తాజాగా ఆయన మృతదేహం లభ్యమైంది.
ఈ విషాద వార్తతో అతని కుటుంబం దిగ్భ్రాంతికి గురైంది. కాగా, సాకేత్ రూమ్మేట్ సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. మరణానికి రెండు వారాల ముందు నుండి సాకేత్ ఆహారం తీసుకోవడం తగ్గించాడని, పనుల పట్ల కూడా ఆసక్తి చూపలేదని రూమ్మేట్ పేర్కొన్నాడు.
కేవలం చిప్స్ తింటూ.. లింక్డ్ఇన్ (LinkedIn) పోస్ట్‌లో సాకేత్ రూమ్మేట్ బనీత్ సింగ్ ఇలా రాశాడు: “నా రూమ్మేట్ సాకేత్ బర్క్లీ హిల్స్ సమీపంలోని లేక్ అంజాలో శవమై కనిపించాడు. అంతర్జాతీయ విద్యార్థిగా జీవితం చాలా కష్టమైనది. గత రెండు వారాలుగా సాకేత్‌లో ఎలాంటి పెద్ద ఇబ్బందులు కనిపించలేదు కానీ, అతను చాలా తక్కువగా తినడం, యాక్టివ్‌గా లేకపోవడం గమనించాను. కేవలం చిప్స్, కుకీస్ తింటూ గడిపేవాడు.” తనను లేక్ అంజాకు సాకేత్ పిలిచినప్పటికీ, బద్ధకం వల్ల తాను వెళ్లలేదని బనీత్ తెలిపాడు.
చివరి సంభాషణ: సాకేత్‌తో జరిగిన చివరి సంభాషణను గుర్తు చేసుకుంటూ.. “సాకేత్ క్లాసులకు వెళ్లేటప్పుడు ఎర్రటి బాత్రోబ్ (Bathrobe) ధరించడం చూశాను. ఎందుకు ఇలా ధరిస్తున్నావని అడిగితే.. ‘నాకు దేనిమీదా పట్టింపు లేదు (I stopped caring). నాకు చలిగా ఉంది, ఎవరూ ఏమనుకున్నా నాకు అనవసరం’ అని సమాధానమిచ్చాడు” అని బనీత్ రాశాడు. సాకేత్ ప్రవర్తన వింతగా మారిందని, దేనినీ పట్టించుకోవడం మానేశాడని అతను పేర్కొన్నాడు.
6 రోజుల తర్వాత మృతదేహం: ఫిబ్రవరి 9న సాకేత్ అదృశ్యం కాగా, పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు ఆరు రోజుల తర్వాత అతని మృతదేహం లభ్యమైంది. శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత రాయబార కార్యాలయం ఈ వార్తను ధృవీకరిస్తూ సంతాపం వ్యక్తం చేసింది.
