జైపూర్: వివాహానికి వచ్చిన అతిథిలా నటించి, వధువు బంగారు ఆభరణాలను దొంగిలించి పరారైన వ్యక్తి కోసం పోలీసులు గాలింపు ఉధృతం చేశారు. జైపూర్లో జరిగిన ఈ ఘటనలో, వధూవరులు స్టేజ్ మీద ఉన్న సమయంలోనే ఈ చోరీ జరిగింది. సుమారు నాలుగు లక్షల రూపాయల విలువైన నగలు మరియు నగదు పోయినట్లు సమాచారం. పెళ్లి ఫోటోగ్రాఫర్ తీసిన వీడియో ఆధారంగా దొంగను గుర్తించారు.
ఫిబ్రవరి 7న జగత్పురాలోని ‘చందన్ వన్ మ్యారేజ్ గార్డెన్’లో నవీన్ కరోల్ వివాహ వేడుక జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. రాత్రి 10:15 గంటలకు వధూవరులు ఫోటోలకు ఫోజులిస్తున్న సమయంలో దొంగ స్టేజ్ వద్దకు చేరుకున్నాడు. అతను సూటు (Blazer) ధరించి, చాలా గౌరవప్రదంగా కనిపించడంతో ఎవరికీ అనుమానం రాలేదు.
వధూవరులు అతిథులను పలకరిస్తూ ఫోటోలు దిగుతున్న బిజీలో ఉండగా, దొంగ నెమ్మదిగా స్టేజ్ మీదకు వెళ్లి వధువు బ్యాగును చేజిక్కించుకున్నాడు. క్షణాల్లో ఆ బ్యాగును తన బ్లేజర్ లోపల దాచుకుని జనం మధ్యలోకి వెళ్ళిపోయాడు. కార్యక్రమం ముగిసిన తర్వాత బ్యాగు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. ఫోటోగ్రాఫర్ తీసిన వీడియోలను పరిశీలించగా ‘అతిథి’ అసలు రంగు బయటపడింది. వరుడి సోదరుడు నితిన్ కరోల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని గుర్తించామని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని జైపూర్ పోలీసులు తెలిపారు.
