మంచి స్నేహితులు లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పెద్దలు చెబుతుంటారు. ఈ మాట రాజస్థాన్ పోలీసు కానిస్టేబుల్ అశోక్ విష్ణోయ్ విషయంలో అక్షరాలా నిజమైంది. రాజస్థాన్‌లోని ఝాలావాడ్ జిల్లాలో పనిచేస్తున్న ఈ కానిస్టేబుల్, తన పెళ్లికి పిలిచిన అతిథుల కారణంగా ఉద్యోగం పోగొట్టుకున్నాడు.
అసలేం జరిగింది? ఫిబ్రవరి 2న నాగౌర్‌లో అశోక్ విష్ణోయ్ వివాహం ఘనంగా జరిగింది. అయితే ఈ పెళ్లికి రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్‌కు చెందిన కరడుగట్టిన మాదకద్రవ్యాల స్మగ్లర్లు (Drug Smugglers) అతిథులుగా హాజరయ్యారు. వారు కేవలం పెళ్లికి రావడమే కాకుండా, స్టేజ్ మీద గాల్లోకి నోట్లు చల్లుతూ హంగామా చేశారు.
చర్యలకు దారితీసిన వీడియో: పెళ్లిలో స్మగ్లర్లు నోట్లు చల్లుతున్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయం పోలీస్ హెడ్ క్వార్టర్స్ వరకు వెళ్లడంతో, ఝాలావాడ్ ఎస్పీ అమిత్ బుడానియా విచారణకు ఆదేశించారు. నిందితులతో కానిస్టేబుల్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ప్రాథమిక విచారణలో తేలడంతో, క్రమశిక్షణారాహిత్యం కింద అతడిని ఉద్యోగం నుండి తొలగిస్తూ (Dismiss) ఉత్తర్వులు జారీ చేశారు.
వచ్చిన అతిథుల నేర చరిత్ర: పెళ్లికి వచ్చిన వారిలో పప్పులాల్, దుర్గాశంకర్, రమేష్ వంటి అనేకమంది ఉన్నారు. వీరిపై NDPS (మాదకద్రవ్యాల చట్టం), పోక్సో మరియు ఆయుధ చట్టం కింద అనేక తీవ్రమైన కేసులు నమోదై ఉన్నాయి. వీరిలో కొందరు కానిస్టేబుల్ పనిచేస్తున్న పోలీస్ స్టేషన్ పరిధిలోని నిందితులే కావడం గమనార్హం.
