మద్యం ప్రభావం అందరిపై ఒకేలా ఉండదు. కొందరు ఎన్ని డ్రింక్స్ తాగినా ఏమీ కానట్లు ఉంటారు, మరికొందరు ఒక్క గ్లాసుకే తలతిరగడం లేదా అసౌకర్యానికి గురవుతారు. దీనికి కేవలం అలవాటు మాత్రమే కారణం కాదు, దీని వెనుక జన్యుపరమైన మరియు జీవనశైలి కారణాలు ఉన్నాయని వడోదరకు చెందిన రేడియాలజిస్ట్ డాక్టర్ హర్ష్ వ్యాస్ వివరించారు.
డాక్టర్ వ్యాస్ ఇద్దరు 37 ఏళ్ల వ్యక్తుల లివర్ అల్ట్రాసౌండ్ నివేదికలను పోల్చారు. అందులో వారానికి రెండు మూడు సార్లు మద్యం తాగే ఇటాలియన్ వ్యక్తి కాలేయం, అస్సలు తాగని భారతీయుడి కంటే ఆరోగ్యంగా ఉండటం గమనార్హం. దీనికి ఆయన మూడు ప్రధాన కారణాలను పేర్కొన్నారు:
1. జన్యుశాస్త్రం (Genetics): శరీరంలో మద్యం విచ్ఛిన్నం కావడానికి ‘ఆల్కహాల్ డీహైడ్రోజనేస్’ మరియు ‘ఆల్డిహైడ్ డీహైడ్రోజనేస్’ అనే ఎంజైమ్లు కీలకం. యూరోపియన్లలో ఈ ఎంజైమ్ యాక్టివిటీ చాలా బాగుంటుంది, దీనివల్ల మద్యం వల్ల కలిగే విషతుల్యాలు త్వరగా విసర్జించబడతాయి. ఆసియా వాసుల్లో (భారతీయుల్లో) ఈ ఎంజైమ్ వేగం తక్కువగా ఉండటం వల్ల ఆ విషపూరిత పదార్థాలు శరీరంలో ఎక్కువ కాలం ఉండి కాలేయంపై ఒత్తిడిని పెంచుతాయి.
2. ఆహారం (Diet): యూరోపియన్లు తమ ఆహారంలో చేపలు, సీఫుడ్, ఆలివ్ ఆయిల్ మరియు తగినంత ప్రోటీన్ తీసుకుంటారు. దీనికి భిన్నంగా, భారతీయ ఆహారం ఎక్కువగా ‘రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్’ (మైదా, చక్కెర వంటివి) మీద ఆధారపడి ఉంటుంది. మద్యం తాగకపోయినా, ఈ కార్బోహైడ్రేట్లు కాలేయంలో కొవ్వు పేరుకుపోయేలా (Fatty Liver) చేస్తాయి.
3. శారీరక శ్రమ (Physical Activity): ఆ ఇటాలియన్ రోగి ప్రతిరోజూ 5-6 కిలోమీటర్లు నడవడమే కాకుండా 30-40 నిమిషాల వ్యాయామం చేసేవారు. మన దేశంలో చాలా మంది క్రమబద్ధమైన వ్యాయామం చేయరు. శారీరక శ్రమ కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా కాపాడుతుంది.
