₹60 కోట్ల ఆస్తి; వారసులు లేకుండా మరణించిన లేడీ డాక్టర్ – హక్కు కోసం పోటీ పడుతున్న బంధువులు!

మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్‌పూర్‌కు చెందిన డాక్టర్ హేమలత (81) గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ రెండు రోజుల క్రితం కన్నుమూశారు. అయితే ఆమె మరణం తర్వాత ఆమె వదిలి వెళ్ళిన ఆస్తి కోసం భారీ పోటీ మొదలైంది.

వివాదం నేపథ్యం: హేమలత తన 81వ పుట్టినరోజును డాక్టర్ సుమిత్, ప్రాచీ దంపతుల సమక్షంలో జరుపుకున్నారు. ఆ సమయంలోనే డాక్టర్ సుమిత్ ఆమె అనారోగ్యాన్ని ఆసరాగా చేసుకుని ఆస్తి పత్రాలపై సంతకాలు చేయించుకున్నారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా ఫిర్యాదు చేసింది. జిల్లా యంత్రాంగం జోక్యం చేసుకుని ఆమెను ఆసుపత్రిలో చేర్పించినప్పుడు, తాను సుమిత్‌కు ఆస్తి రాయలేదని, ఆ పత్రాలు నకిలీవని హేమలత వాంగ్మూలం ఇచ్చారు.

రంగంలోకి మతపరమైన సంస్థలు: మరోవైపు, హేమలత తన మామ మరియు కుమారుడి జ్ఞాపకార్థం ఆసుపత్రి కట్టడానికి 11 వేల చదరపు అడుగుల స్థలాన్ని తమకు దానంగా ఇచ్చారని ఒక మతపరమైన సంస్థ (ట్రస్ట్) పేర్కొంటోంది. హేమలత మరణానంతరం ఆస్తి గొడవలు జరుగుతాయని భావించిన జిల్లా యంత్రాంగమే ఆమె అంత్యక్రియలను నిర్వహించింది.

కోర్టు పరిధిలో ₹60 కోట్ల భూమి: జబల్‌పూర్ నడిబొడ్డున ఉన్న ఈ 11 వేల చదరపు అడుగుల భూమి విలువ సుమారు ₹60 కోట్లు. ఈ ఆస్తి కోసం హేమలత ఇద్దరు సోదరీమణులు (కనకలత, శాంతి మిశ్రా), గాయత్రీ మందిర్ ట్రస్ట్ మరియు డాక్టర్ సుమిత్ పోటీ పడుతున్నారు.

జబల్‌పూర్ జిల్లా కలెక్టర్ రాఘవేంద్ర సింగ్ మాట్లాడుతూ.. “ఈ భూమిని మున్సిపల్ కార్పొరేషన్ లీజుకు ఇచ్చింది, కాబట్టి దీనిని ఎవరికీ దానం చేసే హక్కు లేదు. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది. అందరి వాంగ్మూలాలను పరిశీలించి కోర్టు తుది నిర్ణయం తీసుకుంటుంది” అని తెలిపారు.


Posted

in

by

Tags: