చైనా, పాకిస్థాన్ వంటి శత్రు దేశాల సవాళ్లను ఎదుర్కొంటున్న భారత వైమానిక దళం (IAF) ఇప్పుడు ‘సూపర్ ఎయిర్ పవర్’గా మారబోతోంది. ఫ్రాన్స్‌తో 114 రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంతో పాటు, మరికొన్ని కీలక ఒప్పందాలపై IAF దృష్టి సారించింది. వీటి ద్వారా రాబోయే దశాబ్ద కాలంలో ప్రతి ఏటా కనీసం 40 యుద్ధ విమానాలు వాయుసేన అమ్ములపొదిలో చేరనున్నాయి.
భారీగా యుద్ధ విమానాల అవసరం: ప్రస్తుతం భారత్ వద్ద కేవలం 29 యాక్టివ్ ఫైటర్ స్క్వాడ్రన్లు మాత్రమే ఉన్నాయి. కానీ ఉండాల్సిన సామర్థ్యం 42 స్క్వాడ్రన్లు. చైనా బలాన్ని బట్టి చూస్తే ఈ సంఖ్య 60కి (అంటే 1080 విమానాలు) చేరినా ఆశ్చర్యం లేదు. ప్రస్తుతం మన దగ్గర ఉన్న 500 విమానాలలో దాదాపు 200 విమానాలు (మిగ్, జాగ్వార్, మిరాజ్-2000) వచ్చే దశాబ్ద కాలంలో దశలవారీగా రిటైర్ కానున్నాయి. ఈ లోటును పూడ్చేందుకు భారత్ భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది.
వచ్చే దశాబ్దంలో యుద్ధ విమానాల వర్షం:
- తేజస్ మార్క్-1A: దేశీయంగా తయారైన ఈ 4.5 జనరేషన్ విమానాల డెలివరీకి HAL సిద్ధమైంది. IAF మొత్తం 180 యూనిట్లను ఆర్డర్ ఇచ్చింది. ఏటా 24 నుండి 30 విమానాలు డెలివరీ చేసేలా ప్రణాళిక ఉంది.
- తేజస్ మార్క్-2: వీటి కోసం 120 యూనిట్లను IAF కొనుగోలు చేయనుంది. 2029-30 నుండి వీటి డెలివరీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
- రాఫెల్: ఫ్రాన్స్ నుండి 114 రాఫెల్ విమానాల కోసం దాదాపు రూ. 3.25 లక్షల కోట్ల ఒప్పందం జరగనుంది. 2027లో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగితే, 2029-30 నుండి డెలివరీలు మొదలవుతాయి.
- AMCA (అమ్కా): భారత్ తన సొంత 5వ తరం యుద్ధ విమానం ‘అమ్కా’పై వేగంగా పనిచేస్తోంది. 2034-35 నాటికి ఇవి వైమానిక దళంలో చేరవచ్చు.
