ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ కంటోన్మెంట్ ప్రాంతంలో మానవత్వం మంటగలిసేలా, తన భార్యను కేవలం రూ. 2 లక్షల నగదు మరియు ఒక మోటార్ సైకిల్ కోసం నలుగురు వ్యక్తులకు భర్త అమ్మేసిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
కాన్పూర్ కల్యాణ్‌పూర్ ప్రాంతానికి చెందిన ఒక యువతికి, ఒక వ్యక్తితో కొన్ని ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ప్రారంభంలో సంతోషంగా ఉన్న వీరి జీవితంలో, గత సెప్టెంబర్ 2025 నుండి కలతలు మొదలయ్యాయి. రూ. 2 లక్షల నగదు మరియు ఒక ‘పల్సర్’ బైక్ కావాలని భర్త ఆ యువతిని వేధించడం ప్రారంభించాడు.
బాధిత మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో దిగ్భ్రాంతికరమైన విషయాలను వెల్లడించింది. తన భర్త తరచుగా గుర్తుతెలియని వ్యక్తులను ఇంటికి పిలుచుకొచ్చి మద్యం సేవిస్తాడని, వారితో శృంగారంలో పాల్గొనాలని తనను బలవంతం చేసేవాడని ఆ మహిళ తెలిపింది. దీనిని తాను వ్యతిరేకిస్తే, ఒంటిపై కిరోసిన్ పోసి సజీవ దహనం చేస్తానని భర్త బెదిరించేవాడని ఆమె వాపోయింది.
గత సెప్టెంబర్ 27, 2025 రాత్రి, ఆ వ్యక్తి తన నలుగురు స్నేహితులను ఇంటికి తీసుకువచ్చాడు. భార్యను చూపిస్తూ.. “ఈమెను మీకు అమ్మేశాను, ఇకపై ఈమె మీతోనే ఉండాలి” అని చెప్పి షాక్‌కు గురిచేశాడు. దీనికి ఆ మహిళ అంగీకరించకపోవడంతో, ఒక రోజంతా ఆమెను గదిలో బంధించి, అన్నపానీయాలు ఇవ్వకుండా కొట్టి హింసించాడు.
ఏదోలా తప్పించుకుని తన సోదరుడికి సమాచారం అందించగా, ఆమెను రక్షించడానికి వచ్చిన సోదరుడిని కూడా భర్త తరిమికొట్టాడు. చివరగా, 112 అత్యవసర నంబర్‌కు ఫోన్ చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను సురక్షితంగా రక్షించారు. ప్రస్తుతం భర్తపై వరకట్న వేధింపులు, మానవ అక్రమ రవాణా, లైంగిక వేధింపుల కింద పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
