అబుదాబి: కేవలం 15,000 దిర్హామ్‌ల (సుమారు రూ. 3.4 లక్షలు) విలువైన గోల్డ్ బిస్కెట్ కొనుగోలు చేసిన ఒక ప్రవాసికి, దానికి 50 రెట్లు ఎక్కువ విలువైన గోల్డ్ మెర్సిడెస్ (Gold Mercedes) కారు బహుమతిగా లభించింది.
అల్ హబ్తూర్లోని ఒక కాల్ సెంటర్లో పనిచేస్తున్న శ్రీలంకకు చెందిన సుమిత్ అనే వ్యక్తికి ఈ జాక్‌పాట్ తగిలింది. ఆయన గత 20 ఏళ్లుగా యూఏఈలో నివసిస్తున్నారు.
అదృష్టం వరించింది ఇలా:
సురక్షితమైన పెట్టుబడి కోసం సుమిత్ దుబాయ్‌లోని ‘గోల్డ్ డిస్ట్రిక్ట్’ నుండి గోల్డ్ బిస్కెట్ కొనుగోలు చేశారు. ఆయన ఆ ప్రాంతానికి వెళ్లడం అదే మొదటిసారి. అక్కడ ప్రతి 500 దిర్హామ్‌ల కొనుగోలుపై ఒక లక్కీ డ్రా వోచర్ లభిస్తుంది. సుమిత్ 15,000 దిర్హామ్‌లకు బంగారం కొనడంతో ఆయనకు మొత్తం 30 వోచర్లు వచ్చాయి. ఆ వోచర్లలో ఒకటి సుమిత్‌కు బంగారు రంగు మెర్సిడెస్ కారును గెలుచుకునేలా చేసింది.
సుమిత్ మాటల్లో..
“బంగారం కొని తిరిగి వస్తున్నప్పుడు ఆ కారు ముందు నిలబడి ఫోటో తీసుకున్నాను. కానీ ఆ కారు నా సొంతం అవుతుందని అస్సలు ఊహించలేదు. కొన్ని రోజుల తర్వాత ఆఫీస్ నుండి వచ్చి పడుకున్న సమయంలో ఫోన్ కాల్ వచ్చింది. మొదట నేను నమ్మలేకపోయాను” అని సుమిత్ తన ఆనందాన్ని పంచుకున్నారు.
చాలా మంది ఆ కారును అమ్మేసి వచ్చిన డబ్బును బ్యాంకులో దాచుకోమని సలహా ఇచ్చారని, కానీ తాను మాత్రం ఆ కారును వాడుకోవడానికే మొగ్గు చూపుతున్నానని ఆయన తెలిపారు.
