పాకిస్థాన్ సైనికుల బందీ వీడియోను విడుదల చేసిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ BLA: ‘దేశం కోసం పోరాడితే.. ఇప్పుడు కాదంటున్నారు’

పాకిస్థాన్ భద్రతా దళాలకు చెందిన బందీలు తమను రక్షించమని వేడుకుంటున్న వీడియోను బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) శుక్రవారం (ఫిబ్రవరి 20) విడుదల చేసింది. ఈ వీడియోతో పాకిస్థాన్ ప్రభుత్వానికి, BLAకి మధ్య ఉద్రిక్తత మరింత పెరిగింది.

తమ అదుపులో ఏడుగురు పాక్ సైనికులు ఉన్నారని, ఇస్లామాబాద్ ప్రభుత్వం తమ ఖైదీలను విడుదల చేయకపోతే ఈ బందీలను మరణశిక్ష విధిస్తామని BLA ఇప్పటికే హెచ్చరించింది.

వీడియోలో ఏముంది? వీడియోలో యూనిఫాంలో ఉన్న కొందరు వ్యక్తులు తమ పేర్లు, సర్వీస్ నంబర్లు మరియు యూనిట్ల వివరాలను వెల్లడించారు. “మేము వాళ్ల సైనికులం కాదని ఆర్మీ ఎలా చెబుతుంది?” అని ఒక సైనికుడు తన ఐడెంటిటీ కార్డును చూపిస్తూ ఆవేదన వ్యక్తం చేశాడు. “దేశం కోసం పోరాడితే.. ఇప్పుడు మమ్మల్ని తమ వాళ్లు కాదని వదిలేశారు” అని వారు కన్నీరు పెట్టుకున్నారు.

పెషావర్‌కు చెందిన దీదార్ ఉల్లా అనే వ్యక్తి తాను ’15 ఫ్రాంటియర్ ఫోర్స్ రెజిమెంట్’కు చెందినవాడినని, ఖుజ్దార్‌లో పనిచేస్తున్నప్పుడు బందీగా చిక్కినట్లు తెలిపాడు. తన వికలాంగుడైన తండ్రికి మరియు కుటుంబానికి తానే ఏకైక ఆధారమని ఒక సైనికుడు కెమెరా ముందు విలపించాడు.

ఏడు రోజుల అల్టిమేటం: ఖైదీల మార్పిడి కోసం BLA ఏడు రోజుల గడువు విధించింది. చర్చలకు రాకపోతే బందీలను చంపేస్తామని హెచ్చరించింది. “ఆపరేషన్ హీరోఫ్” రెండో దశలో భాగంగా తాము మొత్తం 17 మందిని పట్టుకున్నామని, అందులో 10 మంది బలూచ్ వ్యక్తులు కావడంతో వారిని వదిలేశామని, మిగిలిన ఏడుగురు పాక్ ఆర్మీకి చెందిన వారని BLA పేర్కొంది.

వారిని తమ ‘బలూచ్ నేషనల్ కోర్టు’ విచారించిందని, వారు పౌరులపై అరాచకాలకు పాల్పడినట్లు నేరారోపణలు ఎదుర్కొంటున్నారని వేర్పాటువాద సంస్థ తెలిపింది.


Posted

in

by

Tags: