అవమానకరం: పాక్ సైనికులను గుర్తించడానికి మునీర్ నిరాకరణ; బందీగా చేసుకున్న బలూచ్ ఆర్మీ.. వీడియోలో కన్నీరు పెట్టుకున్న జవాన్లు

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మరోసారి వార్తల్లో నిలిచారు. బలూచిస్థాన్‌లో ఆపరేషన్ కోసం వెళ్లిన తన సొంత సైనికులను గుర్తించడానికి ఆయన నిరాకరించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అక్కడ ఆపరేషన్‌లో భాగంగా వెళ్లిన ఒక బెటాలియన్‌లోని 7-8 మంది సైనికులను బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) బందీలుగా పట్టుకుంది. ఈ విషయం రావల్పిండిలోని సైనిక ప్రధాన కార్యాలయానికి చేరగా, వారు ఆ సైనికులు తమ వారు కాదని చెప్పడం ఏ దేశానికైనా అత్యంత అవమానకరమైన విషయం.

BLA వీడియో విడుదల: వేర్పాటువాద సంస్థ బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) తాజాగా ఒక వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో ఏడుగురు పాకిస్థాన్ సైనికులు బందీలుగా కనిపిస్తున్నారు. వారు కెమెరా ముందు తమ అధికారిక గుర్తింపు కార్డులను (ID Cards) చూపిస్తూ ప్రాధేయపడుతున్నారు. ఖైదీల మార్పిడి కోసం BLA విధించిన ఫిబ్రవరి 22 గడువుకు కేవలం మూడు రోజులు మాత్రమే సమయం ఉంది. ఈలోగా చర్చలు ప్రారంభం కాకపోతే బందీలను చంపేస్తామని BLA హెచ్చరించింది.

సొంత సైనికులను కాదన్న మునీర్: తమ సైనికులు ఎవరూ అదృశ్యం కాలేదని, ఏ ఉగ్రవాద ముఠా అదుపులోనూ లేరని పాక్ సైనిక అధికారులు అంతకుముందు ప్రకటించారు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ఆ వాదనలను పటాపంచలు చేసింది. “మేము సైన్యంలో చేరాము, మాకు గుర్తింపు కార్డులు ఇచ్చారు, మమ్మల్ని ఇక్కడ విధుల్లో నియమించారు.. ఇప్పుడు సైన్యం మమ్మల్ని గుర్తించడం లేదని ఎలా చెబుతుంది?” అని బందీలు ప్రశ్నిస్తున్నారు.

కన్నీరు పెట్టుకున్న పాక్ సైనికుడు: వీడియోలో ఒక సైనికుడు భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నాడు. “నేను పాకిస్థాన్ కోసం పోరాడుతున్నాను, కానీ ఈ రోజు పాక్ సైన్యం నన్ను తనవాడిగా గుర్తించడం లేదు” అని అతను విలపించాడు. తమను సురక్షితంగా విడిపించేలా BLA డిమాండ్లను అంగీకరించాలని అతను ప్రభుత్వానికి, సైనిక నాయకత్వానికి విజ్ఞప్తి చేశాడు.

మూడు రోజుల గడువు: ఖైదీల మార్పిడి విషయంలో చర్చలు వెంటనే ప్రారంభం కావాలని, లేకపోతే ఏడుగురు సైనికులను ఉరితీస్తామని BLA తన మీడియా విభాగం ‘హక్కాల్’ ద్వారా హెచ్చరించింది. ఈ వీడియోపై పాక్ ప్రభుత్వం లేదా సైన్యం ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.


Posted

in

by

Tags: