లక్నో: ఉత్తరప్రదేశ్లో ప్రేమించి పెళ్లిపీటల వరకు వెళ్లిన ఒక జంటకు చివరి నిమిషంలో పెళ్లి ఆగిపోయింది. దీనికి కారణం వధువు ఎంతో ప్రేమగా పెంచుకున్న ‘కుక్క’ అంటే నమ్మగలరా? కానీ ఇదే నిజం. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ వింత ఘటన వివరాలు ఇలా ఉన్నాయి:
ప్రేమించిన జంటలు పెళ్లిపీటల వరకు వెళ్లడం ఎంతో సంతోషకరమైన విషయం. కానీ ఉత్తరప్రదేశ్లో ఒక వింత సంఘటన వల్ల పెళ్లి ఆగిపోయింది. సుమిత్ కేసర్వాణి (25), తను కేర్వాణి (19) అనే జంట ఒకరినొకరు ప్రేమించుకున్నారు. సుమిత్ ఒక నగల దుకాణం నిర్వహిస్తున్నాడు. వీరి ప్రేమను పెద్దలు అంగీకరించడంతో, ఫిబ్రవరి 19న వివాహం నిశ్చయించారు.
పెళ్లి వేడుక అట్టహాసంగా జరుగుతోంది. బంధుమిత్రుల మధ్య వధూవరులు పెళ్లిపీటలపై కూర్చున్నారు. అదే సమయంలో, వధువు తను పెంచుకుంటున్న కుక్కను కూడా కళ్యాణ మండపానికి తీసుకువచ్చారు. మండపం మూలలో కట్టివేసిన ఆ కుక్క అకస్మాత్తుగా గట్టిగా మొరగడం ప్రారంభించింది. ఇది అక్కడి వారికి ఇబ్బందిగా అనిపించడంతో వరుడి తరపు వారు దానిని శాంతింపజేయడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో కుక్క ఒకరిని కరిచింది.
దీంతో ఆగ్రహం చెందిన వరుడి బంధువులు ఆ కుక్కను కొట్టారు. ఇది వధువు కుటుంబ సభ్యులకు కోపం తెప్పించింది. “మా పెంపుడు జంతువును ఎలా కొడతారు?” అంటూ ఇరువర్గాల మధ్య వాగ్వివాదం మొదలైంది. ఇది కాస్తా ఘర్షణగా మారి కుర్చీలతో పరస్పరం దాడి చేసుకునే వరకు వెళ్లింది. ఈ గొడవలో వధువు తరపు ముగ్గురు వ్యక్తులకు తలలు పగిలాయి, ఒకరికి చేయి విరిగింది. వరుడి తరపు వారికి కూడా స్వల్ప గాయాలయ్యాయి.
ఈ రచ్చతో పెళ్లి ఆగిపోయింది. “నేను నీకేం ద్రోహం చేశానురా.. నా పెళ్లిని ఇలా ఆపివేాశావు” అని ఆ కుక్కను ఉద్దేశించి వరుడు సుమిత్ వాపోతున్నాడు. వధువు ప్రాణంగా పెంచుకున్న కుక్కే ఆమె పెళ్లి ఆగడానికి కారణం కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
