భారతదేశంలోని పశ్చిమ కనుమల (Western Ghats) దట్టమైన అడవులు కింగ్ కోబ్రాలుకు సహజ సిద్ధమైన నివాసాలు. అయితే, సూరత్‌కు చెందిన శాస్త్రవేత్త మరియు సరీసృపాల పరిశోధకుడు దికాన్ష్ పర్మార్ చేపట్టిన ఒక ప్రత్యేక పరిశోధనలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కింగ్ కోబ్రాలు రైళ్లలో ప్రయాణించి సుదూర ప్రాంతాలకు చేరుకునే అవకాశం ఉందని ఈ అధ్యయనం వెల్లడించింది.
అడవి నుండి రైల్వే ట్రాక్ వరకు ఎలా వస్తున్నాయి? గోవాకు వెళ్లే అనేక రైలు మార్గాలు దట్టమైన అడవుల గుండా వెళతాయి. ఆహారం లేదా నివాసం కోసం వెతుకుతూ రాజనాగులు రైలు పట్టాల దగ్గరకు వస్తుంటాయి. ఈ క్రమంలో అవి ప్రమాదవశాత్తు గూడ్స్ లేదా ప్యాసింజర్ రైళ్లలోకి ఎక్కుతున్నాయి. దీనివల్ల అవి తమ సహజ ఆవాసానికి ఎంతో దూరంగా, ఆహారం మరియు రక్షణ లేని ప్రాంతాలకు చేరుకుంటున్నాయి. అమెరికాకు చెందిన ప్రసిద్ధ శాస్త్రీయ పత్రిక ‘బయోట్రోపికా’ (Biotropica) ఈ పరిశోధనను ప్రచురించింది.
గోవాలో గుర్తించిన ఆధారాలు: దికాన్ష్ పర్మార్ అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందంతో కలిసి గోవాలో 47 చోట్ల రాజనాగులు కనిపించిన ప్రాంతాలను విశ్లేషించారు. ఇందులో 18 ఉత్తర గోవాలో, 29 దక్షిణ గోవాలో ఉన్నాయి. ఆశ్చర్యకరంగా ఇవన్నీ రైల్వే స్టేషన్లకు లేదా పట్టాలకు సమీపంలోనే ఉన్నాయి. కర్ణాటకలోని కాజిల్ రాక్ మరియు దండేలి అడవుల నుండి వచ్చే రైళ్ల ద్వారా ఇవి గోవాలోకి ప్రవేశిస్తున్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
రైల్వే డిస్పర్సల్ హైపోథెసిస్ (Railway Dispersal Hypothesis): శాస్త్రవేత్తలు దీనిని ‘రైల్వే విస్తరణ సిద్ధాంతం’గా పేర్కొంటున్నారు. రైల్వే ప్రాంతాల్లో పారేసే ఆహార వ్యర్థాల వల్ల ఎలుకలు అధికంగా చేరుతాయి. ఈ ఎలుకలను వేటాడే క్రమంలో పాములు రైళ్లలోకి ప్రవేశిస్తాయి. వర్షాకాలంలో వరదలు వచ్చినప్పుడు సురక్షితమైన చోటు కోసం కూడా ఇవి రైళ్లలో ఆశ్రయం పొందుతుంటాయి.
