ఆపరేషన్ త్రాశి-1 అసలు హీరో టైసన్: ఉగ్రవాదుల మొదటి బుల్లెట్‌ను తనే ఎదుర్కొని, జైషే కమాండర్లను మట్టుబెట్టడంలో కీలక పాత్ర!

జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ అడవుల్లో నేడు తుపాకుల మోత మధ్య ఒక అద్భుత సాహసగాథ లిఖించబడింది. భారత సైన్యంలోని మూగ యోధుల పట్ల గౌరవాన్ని ఈ ఘటన రెట్టింపు చేసింది. ‘ఆపరేషన్ త్రాశి-1’లో భాగంగా భద్రతా దళాలు ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులను హతం చేశాయి. అయితే ఈ మిషన్ విజయంలో ప్రధాన పాత్ర పోషించింది సైన్యానికి చెందిన ధైర్యవంతుడైన జర్మన్ షెపర్డ్ డాగ్ ‘టైసన్’.

ఘటన వివరాలు: చత్రూ ప్రాంతంలోని పాసెర్‌కుట్ అడవుల్లో 2-పారా స్పెషల్ ఫోర్స్ మరియు పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినప్పుడు, దట్టమైన అడవుల్లో ఉగ్రవాదుల ఆచూకీ కనుగొనడం కష్టమైంది. ఆ సమయంలో టైసన్ రంగంలోకి దిగింది. ఉగ్రవాదులు దాక్కున్న స్థావరం వైపు టైసన్ వెళ్లగానే, కంగారుపడిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల మొదటి బుల్లెట్ టైసన్ కాలికి తగిలింది. రక్తమోడుతున్నా, తట్టుకోలేని నొప్పి ఉన్నా ఈ వీర యోధుడు వెనక్కి తగ్గలేదు. సైన్యం ఉగ్రవాదులను పూర్తిగా చుట్టుముట్టే వరకు అక్కడే నిలబడింది.

వైమానిక మార్గంలో ఆసుపత్రికి తరలింపు: టైసన్ ధైర్యం వల్లనే ఇద్దరు అగ్రశ్రేణి కమాండర్లు సహా ముగ్గురు జైషే ఉగ్రవాదులను సైన్యం హతం చేయగలిగింది. ఘటనా స్థలం నుండి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన టైసన్‌ను వెంటనే భారత సైన్యానికి చెందిన హెలికాప్టర్ ద్వారా ఉధంపూర్‌కు తరలించారు. ప్రస్తుతం టైసన్ ప్రాణాపాయం నుండి బయటపడిందని, వేగంగా కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.


Posted

in

by

Tags: