ఫిబ్రవరి 21న ‘ఐరిష్ టైమ్స్’ (Irish Times) ప్రచురించిన ఒక కథనం ఇప్పుడు ఇంటర్నెట్లో పెద్ద చర్చకు దారితీసింది. గాల్వే విశ్వవిద్యాలయంలో (University of Galway) ఆహార కొరత కారణంగా ప్రతి వారం వందలాది మంది విద్యార్థులకు ఫుడ్ బ్యాంక్ ఆహారాన్ని అందించలేకపోతోందని ఆ కథనం పేర్కొంది.
అయితే, ఈ వార్తతో పాటు ప్రచురించిన ఒక ఫోటో ఇప్పుడు వివాదానికి కారణమైంది. ఆ ఫోటోలో ఆహారం కోసం క్యూలో నిలబడిన విద్యార్థుల్లో అత్యధికులు భారతీయులు లేదా దక్షిణాసియా (Desi) విద్యార్థులుగా కనిపిస్తున్నారు. విదేశీ విద్యార్థులు, సాధారణంగా సంపన్న నేపథ్యం ఉన్నవారు, కేవలం స్థానిక పేదల కోసం ఉద్దేశించిన ఉచిత సౌకర్యాలను ఎలా వాడుకుంటారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
సోషల్ మీడియాలో విమర్శలు: ఈ ఫోటో ‘X’ (గతంలో ట్విట్టర్) వేదికగా వేగంగా వ్యాపించింది. చాలామంది భారతీయ విద్యార్థులు వ్యవస్థను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.
- “గాల్వే యూనివర్సిటీ ఫుడ్ బ్యాంక్ దగ్గర క్యూలో ఉన్నవారిలో 90% కంటే ఎక్కువ మంది భారతీయ విద్యార్థులే. తమను తాము పోషించుకోలేనప్పుడు వారు ఐర్లాండ్‌లో ఎందుకు ఉంటున్నారు? లేక ఇది డబ్బు ఆదా చేయడానికి చేస్తున్న స్కామా?” అని ఒక యూజర్ పోస్ట్ చేశారు.
- స్టూడెంట్ వీసా నిబంధనల ప్రకారం.. విద్యార్థి తన ఖర్చుల కోసం తగినంత డబ్బు కలిగి ఉండాలి. “వీరు వీసా అప్లికేషన్లలో అబద్ధాలు చెబుతున్నారా? లేదా ఐర్లాండ్‌లోని నిజమైన పేద విద్యార్థులకు అందాల్సిన వనరులను వీరు లాగేసుకుంటున్నారా?” అని మరికొందరు మండిపడ్డారు.
యూనివర్సిటీ పరిస్థితి: గాల్వే యూనివర్సిటీ ఐర్లాండ్‌లోని అత్యంత పురాతనమైన విద్యాలయాల్లో ఒకటి. ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే భారతీయ విద్యార్థుల సంఖ్య చాలా ఎక్కువ. ఐర్లాండ్‌లో పెరుగుతున్న జీవన వ్యయం (Cost-of-living crisis) కారణంగా విద్యార్థులు నడుపుతున్న ఈ ఫుడ్ బ్యాంక్‌పై విపరీతమైన ఒత్తిడి పెరుగుతోందని ఐరిష్ టైమ్స్ కథనం వెల్లడించింది.
