అలీగఢ్‌లో ఆకతాయికి దేహశుద్ధి: 35 సెకన్లలో 37 సార్లు చెప్పుతో కొట్టిన మహిళ; వేధింపులు భరించలేకపోయమన్న భర్త.. వైరల్!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అలీగఢ్ జిల్లాలో ఒక ఆకతాయికి మహిళ బుద్ధి చెబుతున్న వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో చర్చనీయాంశమైంది. చాలా కాలంగా తనను వేధిస్తున్న యువకుడి కాలర్ పట్టుకోవడమే కాకుండా, ఏకంగా పోలీస్ స్టేషన్ ముందే చెప్పుతో చితక్కొట్టేసింది ఆ మహిళ.

ఏం జరిగింది? ఈ ఘటన గంగీరీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వైరల్ అవుతున్న 52 సెకన్ల వీడియోలో, కేసరి రంగు చీర కట్టుకున్న మహిళ విపరీతమైన ఆగ్రహంతో కనిపిస్తోంది. సదరు యువకుడు చాలా కాలంగా ఆమెను వెంబడిస్తూ, వేధిస్తూ, అప్రతిష్ఠ పాలు చేస్తానని బెదిరిస్తున్నాడని సమాచారం.

మహిళ తన భర్తతో కలిసి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నప్పుడు, నిందితుడు కూడా అక్కడే కనిపించాడు. వెంటనే ఆమె భర్త ఆ యువకుడిని బైక్ పైనుంచి కిందకు లాగి పడేశాడు. ఆ వెంటనే మహిళ తన చెప్పు తీసి కేవలం 35 సెకన్ల వ్యవధిలో యువకుడి తల, ముఖం, ఛాతీపై ఏకంగా 37 సార్లు దాడి చేసింది. అంతటితో ఆగకుండా అతడిని కాళ్లతో కూడా తన్నింది.

మౌనంగా ఉన్న పోలీసులు: ఈ డ్రామా అంతా పోలీస్ స్టేషన్ ముందే జరుగుతున్నా, పోలీసులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీడియోలో ఒక కానిస్టేబుల్ పక్కనే ఉండి ఫోన్ మాట్లాడుతుండగా, మరికొందరు పోలీసులు మౌనంగా చూస్తూ ఉండిపోయారు. చాలా సేపటి తర్వాత ఒక దొరొగా (SI) వచ్చి యువకుడిని వారి నుండి విడిపించి స్టేషన్ లోపలికి తీసుకెళ్లారు.

బాధిత మహిళ ఆవేదన: నిందితుడి ప్రవర్తన వల్ల తన కుటుంబం మానసికంగా కుంగిపోయిందని ఆ మహిళ తెలిపింది. వేధింపులు భరించలేక, ఇక సహనం నశించి తానే స్వయంగా ఎదురుదాడి చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. ప్రస్తుతం పోలీసులు ఇరువర్గాలను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.


Posted

in

by

Tags: