దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో తల్లి కళ్లుగప్పి ఆడుకోవడానికి వెళ్లిన ఒక పసికందు, ప్రమాదానికి గురై మరణించిన విషాద ఘటన చోటుచేసుకుంది.
ఈ ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను శిక్షించడం తమకు ఇష్టం లేదని ఆ కేరళ దంపతులు పేర్కొన్నారు. డ్రైవర్‌పై ఫిర్యాదు చేయడానికి వారు నిరాకరించారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న సమయంలో కూడా ఆ తల్లిదండ్రులు వ్యవహరించిన తీరు మరియు వారు చెప్పిన కారణం అందరినీ కలచివేస్తోంది.
కనీసం రెండు ఏళ్లు కూడా నిండని తమ కుమారుడిని కోల్పోయిన బాధలో కూడా వారు తీసుకున్న ఈ నిర్ణయం ఒకేసారి విషాదాన్ని, మానవత్వాన్ని చాటిచెబుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి:
కారు రివర్స్ తీస్తున్న సమయంలో.. కేరళకు చెందిన షెరాబుద్దీన్ దుబాయ్‌లో పని చేస్తున్నారు. ఆయన తన భార్య మరియు 22 నెలల కుమారుడు ఆలన్ రూమితో కలిసి అక్కడ నివసిస్తున్నారు. తన వయసుకి తగిన అల్లరితో ఎప్పుడూ ఆడుకునే ఆలన్, ఘటన జరిగిన రోజున తన తల్లి చెత్త వేయడానికి అపార్ట్మెంట్ ఆవరణలోని పార్కింగ్ ఏరియాకు వెళ్లినప్పుడు ఆమెతో పాటే వెళ్లాడు.
తల్లి చెత్త వేస్తున్న సమయంలో, అక్కడ ఆడుకుంటున్న చిన్నారిని గమనించకుండా ఒక డ్రైవర్ తన కారును పార్కింగ్ నుండి రివర్స్ తీశాడు. కారు తగలడంతో ఆ చిన్నారి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆ డ్రైవరే ఆంబులెన్స్ కోసం ఆగకుండా తన కారులోనే బాబును ఆసుపత్రికి తరలించాడు.
కేరళ దంపతుల నిర్ణయం అయితే, ఆసుపత్రికి వెళ్లేసరికే అంతర్గత గాయాల వల్ల బాబు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంపై స్పందించిన తల్లిదండ్రులు.. “ఈ విషయంలో ఎవరినీ తప్పు పట్టలేం. అందరి వైపు నుండి పొరపాట్లు జరిగాయి. మేము డ్రైవర్‌పై ఎలాంటి ఫిర్యాదు చేయడం లేదు” అని తెలిపారు.
దీంతో డ్రైవర్ జైలు నుండి విడుదలయ్యారు. “ఇది దురదృష్టవశాత్తూ జరిగిన ప్రమాదం. అందరూ అజాగ్రత్తగా ఉన్నారు. డ్రైవర్‌ను శిక్షించినంత మాత్రాన నా కొడుకు తిరిగి రాడు. మేము ఈ బాధ నుండి కోలుకోవాలని కోరుకుంటున్నాము. మా బాబు మా జీవితంలో ఒక వెలుగును నింపాడు. వాడు లేడన్న నిజాన్ని ఇక మేము అంగీకరించాలి” అని తండ్రి ఆవేదనతో చెప్పారు.
విషాదంతో స్వదేశానికి.. ఆలన్ రూమి అంత్యక్రియలు దుబాయ్‌లోనే నిర్వహించారు. ప్రస్తుతం ఆ దంపతులు తమ సొంత ఊరైన కేరళకు తిరిగి వచ్చారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ కూడా భారతీయుడే కావడం గమనార్హం. ఫ్యామిలీ వీసాపై యూఏఈలో స్థిరపడాలని ప్లాన్ చేసుకున్న ఆ కుటుంబంలో ఈ ప్రమాదం తీరని శోకాన్ని నింపింది.
