ప్రముఖ ప్యాకేజ్డ్ ఎగ్ బ్రాండ్ ‘ఎగ్గోజ్’ (Eggoz) మరోసారి వివాదంలో చిక్కుకుంది. తాను ఆర్డర్ చేసిన గుడ్ల లోపల ప్లాస్టిక్ ఉందని ఒక మహిళ వీడియో ద్వారా ఆరోపించడమే దీనికి కారణం.
జెప్టో (Zepto) క్విక్-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ఆమె ఈ గుడ్లను కొనుగోలు చేశారు. ఈ ఆరోపణలపై కంపెనీ స్పందించినప్పటికీ, వీడియోలో కనిపిస్తున్నది నిజంగా ప్లాస్టిక్ లేదా మరేదైనా అనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది.
మహిళ ఆరోపణలు: వీడియోలో ఆమె మాట్లాడుతూ.. “మార్కెట్లో నకిలీ గుడ్లు, ప్లాస్టిక్ గుడ్లు దొరుకుతున్నాయని విన్నాము కానీ, ఈరోజు నా ఇంట్లోనే చూశాను. జెప్టోలో ఎగ్గోజ్ బ్రాండ్ గుడ్లు ఆర్డర్ ఇచ్చాను. వాటిని ఉడకబెట్టినప్పుడు లోపల సొనకు బదులు ప్లాస్టిక్ వంటి పదార్థం నూడుల్స్ రూపంలో బయటకు వచ్చింది. ప్రతి గుడ్డుపై బ్రాండ్ స్టాంప్ ఉంది. ఇంత పెద్ద బ్రాండ్ల పరిస్థితి ఇలా ఉంటే ఇక తినడానికి ఏది సురక్షితం?” అని ప్రశ్నించారు.
నెటిజన్ల స్పందన: ఈ వీడియోపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. “పిల్లలకు ప్రోటీన్ అందుతుందని కొంటున్నాము, కానీ ఏది ఆరోగ్యకరమో అర్థం కావడం లేదు” అని కొందరు, “ఆన్లైన్లో గుడ్లు ఆర్డర్ చేయకండి, గడువు ముగియడానికి సిద్ధంగా ఉన్నవే పంపిస్తారు” అని మరికొందరు కామెంట్ చేశారు. ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ (FSSAI) ఏం చేస్తోందని ప్రజలు నిలదీశారు.
కంపెనీ స్పందన: వీడియో వైరల్ కావడంతో ఎగ్గోజ్ కంపెనీ స్పందిస్తూ.. “మీకు ఎదురైన అనుభవానికి మేము వింతిస్తున్నాము. మీ వివరాలు పంపండి, మా కస్టమర్ సపోర్ట్ టీమ్ మిమ్మల్ని సంప్రదించి ఈ సమస్యను త్వరగా పరిష్కరిస్తుంది” అని తెలిపింది.
