ఉద్యోగం చేయని భార్య ఇంట్లో ఖాళీగా కూర్చుంటోందని చెప్పడం ఏమాత్రం సరికాదు. భరణం (Maintenance) నిర్ణయించేటప్పుడు, కుటుంబం కోసం ఆమె చేసే కృషిని విస్మరించడం న్యాయం కాదని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది.
కేసు నేపథ్యం:
ఢిల్లీకి చెందిన ఒక దంపతులకు 2012లో వివాహం జరిగింది. వారికి 7 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే 2020లో భర్త తన భార్యాపిల్లలను వదిలేసి వెళ్ళిపోయాడని ఆరోపణలు వచ్చాయి. భరణం కోరుతూ భార్య మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించగా, “ఆమె విద్యావంతురాలు, పని చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ కావాలనే ఖాళీగా ఉంటోంది” అనే కారణంతో కోర్టు ఆమెకు భరణం నిరాకరించింది. దీనిపై ఆమె హైకోర్టును ఆశ్రయించింది.
కోర్టు సంచలన తీర్పు:
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ గృహహింస నిరోధక చట్టం కింద ఆ మహిళకు భరణం మంజూరు చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు:
- ‘ఖాళీగా కూర్చోవడం’ ఒక అపోహ: గృహిణి ఇంట్లో ఖాళీగా కూర్చోదు. భర్త బయట సంపాదించడానికి వెళ్తున్నాడంటే, వెనుక నుండి ఆమె ఇల్లు, పిల్లల బాధ్యతలను చూసుకోవడమే కారణం. ఆమె శ్రమ వల్లే భర్త తన వృత్తిపై దృష్టి పెట్టగలుగుతున్నాడు.
- కనిపించని ఆర్థిక విలువ: ఇల్లు నిర్వహించడం, పిల్లల పెంపకం, కుటుంబ అవసరాల కోసం తన జీవితాన్ని సర్దుబాటు చేసుకోవడం వంటి పనులకు జీతం ఉండకపోవచ్చు, కానీ వాటికి గొప్ప ఆర్థిక విలువ ఉంది. ఇవి బ్యాంక్ స్టేట్మెంట్లలో కనిపించవు లేదా పన్ను పరిధిలోకి రావు, కానీ ఇవే కుటుంబ వ్యవస్థను నడుపుతున్నాయి.
- సోమరితనం కాదు: భార్య ఉద్యోగం చేయకపోవడాన్ని సోమరితనంగానో లేదా కావాలనే భర్తపై ఆధారపడటంగానో భావించలేము. ఆమె ఇంటి కోసం పడుతున్న శ్రమను గుర్తించడం చాలా అవసరం.
తీర్పు:
ప్రస్తుత కేసులో భార్యకు ఎటువంటి ఆదాయం లేదని తేలడంతో, గృహహింస చట్టం కింద ఆమెకు నెలకు ₹50,000 భరణం చెల్లించాలని భర్తను కోర్టు ఆదేశించింది. భార్య పని చేయకపోవడాన్ని ‘ఏమీ చేయకపోవడం’తో పోల్చలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది.
