లక్నోలో సంచలనం సృష్టించిన నీలి రంగు డ్రమ్ కేసులో అసలు కారణంపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. నిందితుడు అక్షత్ చెబుతున్న NEET పరీక్ష ఒత్తిడి అనే వాదనను బంధువులు, ఇరుగుపొరుగు వారు నమ్మడం లేదు. కుటుంబ కలహాల కారణంగానే లైసెన్స్డ్ రైఫిల్‌తో కాల్పులు జరిగాయని పోలీసులు అధికారికంగా ధృవీకరించారు.
ఆ రాత్రి అసలేం జరిగింది?
ఒక పొరుగు వ్యక్తి తెలిపిన సమాచారం ప్రకారం.. ఫిబ్రవరి 19న మానవేంద్ర సింగ్ ఇంటికి రాగానే తండ్రీకొడుకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇంట్లో దాచిన 50 లక్షల రూపాయలలో కొంత మొత్తం మాయం కావడమే దీనికి కారణం. అక్షత్ ఆ డబ్బును తన విలాసాలకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. మద్యం దుకాణం (లిక్కర్ షాప్) లైసెన్స్ రిన్యూవల్ కోసం ఉంచిన ఆ డబ్బు ఖర్చు కావడంతో కోపంతో మానవేంద్ర సింగ్ కొడుకును చెంపదెబ్బ కొట్టి, రైఫిల్ తీసి బెదిరించారు.
దీంతో కక్ష పెంచుకున్న అక్షత్, తెల్లవారుజామున 4 గంటల సమయంలో తండ్రి పడుకుని ఉండగా తల వెనుక భాగంలో కాల్చి చంపాడు.
సోదరి మౌనం.. బాడీని దాచే ప్లాన్
ఈ హత్య గురించి అక్షత్ సోదరి కృతికి ముందే తెలుసు. తల్లి ఇదివరకే మరణించడంతో, తండ్రి పోయాక ఇప్పుడు అన్న కూడా దూరమవుతాడనే భయంతో ఆమె మౌనంగా ఉండిపోయింది. హత్య తర్వాత ఇద్దరూ అదే గదిలో ఉన్నారు. మొదట పోలీసులకు లొంగిపోవాలని అక్షత్ భావించినా, సోదరి ఒంటరి అయిపోతుందనే భయంతో మృతదేహాన్ని ముక్కలు చేసి డ్రమ్ములో దాచి పారేయాలని ప్లాన్ చేశాడు.
పట్టుబడటానికి కారణమైన మునీమ్
సోమవారం నాడు డ్రమ్ములో ఉన్న తండ్రి మొండెం భాగాన్ని కారులో తీసుకువెళ్లి పారేయాలని అక్షత్ ప్రయత్నించాడు. సరిగ్గా అదే సమయంలో మద్యం దుకాణం మునీమ్ (అకౌంటెంట్) రిన్యూవల్ డబ్బుల కోసం ఇంటికి వచ్చాడు. దీంతో భయపడిన అక్షత్ మృతదేహాన్ని బయటకు తీసుకువెళ్లలేకపోయాడు. పోలీసులు అక్షత్ వద్ద నుండి రంపంతో పాటు రెండు కత్తులను కూడా స్వాధీనం చేసుకున్నారు.
ముఖంలో పశ్చాత్తాపం.. సోదరిపై ఆందోళన
కోర్టుకు తరలిస్తున్న సమయంలో NDTV ప్రతినిధి “తండ్రిని చంపినందుకు బాధగా ఉందా?” అని అడిగిన ప్రశ్నకు అక్షత్ తల వంచి ‘అవును’ అన్నట్లుగా సైగ చేశాడు. ఈ హత్యలో తన కుటుంబ సభ్యులెవరికీ సంబంధం లేదని అతను స్పష్టం చేశాడు. కోర్టు అక్షత్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. లక్నో పోలీసులు ప్రతి కోణంలోనూ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.
