దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో పనిచేస్తున్న భారతీయ సంతతికి చెందిన మురుగానంద్ గోవిందన్‌ను అదృష్టం వరించింది. ఆయన కొన్న లాటరీకి ఏకంగా రూ. 12.3 కోట్ల బంపర్ ప్రైజ్ తగిలింది.
మొదటిసారి లాటరీ టిక్కెట్ కొన్న వ్యక్తికి, ఊహించని రీతిలో కోట్లాది రూపాయల బహుమతి లభించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. “దేవుడు ఇస్తే ఇల్లు వెతుక్కుంటూ వస్తుంది” అన్నట్లుగా, తొలి ప్రయత్నంలోనే గెలుపొందడంతో మురుగానందం ఆనందానికి అవధులు లేవు. ఈ డబ్బుతో తన సొంత ఇంటి కల నెరవేరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
భారతీయుడిని వరించిన అదృష్టం
లాటరీలో ఎవరికి, ఎప్పుడు అదృష్టం వరిస్తుందో ఎవరూ చెప్పలేరు. కొందరు ఏళ్ల తరబడి టిక్కెట్లు కొన్నా రూపాయి కూడా గెలవలేరు. కానీ మరికొందరికి మాత్రం మొదటి టిక్కెట్టే జీవితాన్ని మలుపు తిప్పేస్తుంది. గతంలో కేరళ ఓణం బంపర్‌లో కూడా ఓ పెయింట్ షాపు ఉద్యోగికి మొదటి ప్రయత్నంలోనే రూ. 25 కోట్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అలాంటిదే యూఏఈలో జరిగింది.
సొంత ఇల్లు కూడా లేదు..
41 ఏళ్ల మురుగానంద్ గోవిందన్ గత మూడేళ్లుగా యూఏఈలో ఉంటూ కష్టపడి సంపాదిస్తున్నారు. భారతదేశంలో ఆయనకు కనీసం ఉండటానికి సొంత ఇల్లు కూడా లేదు. అద్దె ఇంట్లో ఉంటూ ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన అక్కడ లాటరీ టిక్కెట్‌ను కొనుగోలు చేశారు. దానికి 5 మిలియన్ దిర్హామ్‌లు (భారత కరెన్సీలో సుమారు రూ. 12.3 కోట్లు) బహుమతిగా వచ్చింది.
జీవితంలో ఊహించని మలుపు
ఈ విజయంపై మురుగానందం స్పందిస్తూ.. “నేను మూడేళ్లుగా ఇక్కడ ఉంటున్నాను. నా పిల్లల చదువులు, ఇతర బాధ్యతలన్నీ నాపైనే ఉన్నాయి. అందుకే ఇక్కడికి వచ్చాను. ఇంత త్వరగా నా జీవితంలో ఇంతటి మలుపు వస్తుందని అస్సలు అనుకోలేదు. మేము ఇంకా అద్దె ఇంట్లోనే ఉంటున్నాము. సొంత ఇల్లు కట్టుకోవాలనే నా కోరికను ఇన్నాళ్లూ నెరవేర్చుకోలేకపోయాను. ఇప్పుడు ఆ కష్టాలన్నీ తీరిపోయే మార్గం దొరికింది. ఇది దేవుడు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నాను” అని సంతోషం వ్యక్తం చేశారు.
తమిళనాడు వ్యక్తి అయి ఉండొచ్చు..
మురుగానంద్ కొన్న ‘260214’ అనే నంబర్ టిక్కెట్‌కు ఈ రెండో బహుమతి లభించింది. మొదటి బహుమతి (30 మిలియన్ దిర్హామ్‌లు) ఇంకా ఎవరూ క్లెయిమ్ చేసుకోలేదు. మురుగానందం తన స్నేహితుడితో కలిసి ఈ టిక్కెట్‌ను కొనుగోలు చేయడంతో, వచ్చిన బహుమతి మొత్తాన్ని ఇద్దరూ పంచుకోనున్నారు. మురుగానందం భారతదేశంలోని ఏ రాష్ట్రానికి చెందినవారనేది స్పష్టంగా తెలియనప్పటికీ, ఆయన పేరును బట్టి తమిళనాడుకు చెందిన వ్యక్తి అయి ఉండవచ్చని భావిస్తున్నారు.
