అమెరికా వివాదాస్పద వ్యాపారవేత్త జెఫ్రీ ఎప్స్టీన్కు సంబంధించిన రహస్య పత్రాలు వెల్లడికావడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేగుతున్నాయి. ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన తప్పును ఒప్పుకోవడం ఇప్పుడు పెను సంచలనంగా మారింది.
మహిళలను అక్రమంగా రవాణా చేసి లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో అరెస్ట్ అయ్యి, 2019లో జైలులోనే ఆత్మహత్య చేసుకున్న జెఫ్రీ ఎప్స్టీన్ కస్టమర్ల జాబితాలో బిల్ గేట్స్ పేరు కూడా ఉంది. ఇటీవల విడుదలైన ‘ఎప్స్టీన్ ఫైల్స్’లో బిల్ గేట్స్ రష్యన్ మహిళలతో సంబంధం కలిగి ఉన్నారని, దానివల్ల కలిగిన అనారోగ్యానికి రహస్యంగా చికిత్స పొందారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, తన ఫౌండేషన్ ఉద్యోగులతో మాట్లాడిన బిల్ గేట్స్.. రష్యన్ మహిళలతో సంబంధం ఉన్న విషయాన్ని అంగీకరించారు. ఎప్స్టీన్తో స్నేహం చేయడం తాను చేసిన అతిపెద్ద తప్పని, అందుకు క్షమాపణలు కోరుతున్నానని ఆయన తెలిపారు.
ఎలన్ మస్క్ స్పందన: “కర్మ ఈజ్ రియల్”
బిల్ గేట్స్ చేసిన ఈ ప్రకటనపై సోషల్ మీడియాలో ఒక నెటిజన్ స్పందిస్తూ, “టెస్లా షేర్లను పడగొట్టాలని చూసే వారికి మంచి నైతిక విలువలు ఉండవు” అని పోస్ట్ చేశారు. దీనికి టెస్లా అధినేత ఎలన్ మస్క్ రియాక్ట్ అవుతూ, “కర్మ అనేది నిజం” (Karma is real) అని బదులిచ్చారు.
మస్క్ ఇలా స్పందించడానికి ఒక బలమైన కారణం ఉంది. టెస్లా కంపెనీ షేర్లు పడిపోతాయని ఆశిస్తూ బిల్ గేట్స్ సుమారు 500 మిలియన్ డాలర్లు (రూ. 4,150 కోట్లు) ‘షార్ట్ సెల్లింగ్’ పద్ధతిలో బెట్టింగ్ కాశారు. గత ఎనిమిదేళ్లుగా బిల్ గేట్స్ ఈ పందెంలోనే ఉన్నారు. అయితే టెస్లా విలువ పెరిగితే గేట్స్ దివాళా తీయడం ఖాయమని మస్క్ గతంలోనే హెచ్చరించారు.
ప్రస్తుతం ప్రపంచ కుబేరుల జాబితాలో ఎలన్ మస్క్ మొదటి స్థానంలో ఉండగా, బిల్ గేట్స్ మొదటి 10 స్థానాల్లో కూడా లేకపోవడం గమనార్హం. అదే సమయంలో, ఇటీవల విడుదలైన ఎప్స్టీన్ ఫైల్స్లో ఎలన్ మస్క్ పేరు కూడా ఉండటం మరిన్ని చర్చలకు దారితీస్తోంది.
