ఇస్లామాబాద్: పాకిస్థాన్ మరియు ఆఫ్ఘనిస్థాన్ మధ్య సరిహద్దు వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. రాత్రికి రాత్రే పాకిస్థాన్పై ఆఫ్ఘనిస్థాన్ దళాలు ఆకస్మికంగా దాడులు ప్రారంభించాయి.
ఆఫ్ఘన్ తాలిబన్ దళాలు జరిపిన ఈ దాడిలో 55 మంది పాకిస్థానీ సైనికులు మరణించినట్లు సమాచారం అందుతోంది. దీంతో సరిహద్దు వెంబడి అత్యంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత కొంతకాలంగా ఇరు దేశాల మధ్య ఘర్షణలు జరుగుతున్నప్పటికీ, ఈ స్థాయి దాడి జరగడం కలకలం రేపుతోంది.
రాత్రికి రాత్రే దాడి
ఆఫ్ఘనిస్థాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఈ దాడికి సంబంధించి ఒక వివరణాత్మక ప్రకటన విడుదల చేసింది. కొద్ది రోజుల క్రితం ఆఫ్ఘన్ భూభాగంలోకి చొరబడి పాకిస్థాన్ జరిపిన దాడుల్లో మహిళలు, పిల్లలు మరణించారని, దానికి ప్రతీకారంగానే ఈ దాడి చేసినట్లు ఆఫ్ఘన్ తెలిపింది. నిన్న రాత్రి (ఫిబ్రవరి 26, 2026) రాత్రి 8:00 గంటలకు ఈ ప్రతీకార దాడి ప్రారంభమైందని పేర్కొంది.
ప్రాంతాలను స్వాధీనం చేసుకున్న ఆఫ్ఘన్ దళాలు
దురాండ్ లైన్ వెంబడి ఉన్న పక్షికా, పక్షియా, ఖోస్ట్, నంగర్హర్, కునార్ మరియు నూరిస్థాన్ ప్రాంతాల్లో ఆఫ్ఘన్ దళాలు ఏకకాలంలో దాడులు జరిపాయి. ఈ నాలుగు గంటల భీకర పోరులో రెండు పాకిస్థాన్ సైనిక స్థావరాలు మరియు 19 సైనిక శిబిరాలను (Army Camps) స్వాధీనం చేసుకున్నట్లు ఆఫ్ఘన్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మరో నాలుగు స్టేషన్ల నుండి పాక్ సైనికులు ప్రాణభయంతో పారిపోయినట్లు సమాచారం.
మొత్తం 55 మంది పాకిస్థానీ సైనికులు చనిపోయారని, వారి మృతదేహాలను ఆఫ్ఘనిస్థాన్కు తరలించామని, మరికొందరు సైనికులను సజీవంగా బందీలుగా పట్టుకున్నామని ఆఫ్ఘన్ దళాలు తెలిపాయి. అంతేకాకుండా భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నాయి.
పాకిస్థాన్ ప్రతీకారం
తాలిబన్ల ప్రకటన వచ్చిన కొద్ది గంటల్లోనే పాకిస్థాన్ కూడా ఎదురుదాడి ప్రారంభించింది. ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లో తెల్లవారుజామున పేలుడు శబ్దాలు, యుద్ధ విమానాల మోత వినిపించింది. కాబూల్, కాందహార్ మరియు పక్షియా ప్రాంతాల్లో పాకిస్థాన్ వైమానిక దాడులు జరిపిందని తాలిబన్ ప్రతినిధి జబిబుల్లా ముజాహిద్ ఆరోపించారు. అయితే, అదృష్టవశాత్తూ ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఆయన తెలిపారు.
ఉద్రిక్తత
ఇరు దేశాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో ప్రాణనష్టం పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ ఘర్షణలు పూర్తిస్థాయి యుద్ధంగా మారితే సరిహద్దు ప్రాంతాల్లో భారీ విధ్వంసం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
