న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 ప్రారంభం రెండు రోజులు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ‘క్రిక్బజ్’ నివేదిక ప్రకారం, ఈ టోర్నమెంట్ మార్చి 28 లేదా 29న ప్రారంభం కావచ్చని అంచనా. గత ఏడాది డిసెంబర్లో అబుదాబిలో జరిగిన మినీ వేలం తర్వాత, ఐపీఎల్ మార్చి 26 నుండి ప్రారంభమవుతుందని భావించారు. కానీ ఇప్పుడు ఒకటి లేదా రెండు రోజులు ఆలస్యం కావచ్చని తెలుస్తోంది.
దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అలాగే, మార్చి మొదటి వారంలో ఐపీఎల్ 2026 షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.
ఎన్నికల ప్రభావం
షెడ్యూల్ ఆలస్యం కావడానికి ప్రధాన కారణం ఎన్నికలే. తమిళనాడు, కేరళ, అస్సాం మరియు పశ్చిమ బెంగాల్ అనే నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కొన్ని నగరాల్లో ఎన్నికల తేదీలు, మ్యాచ్ తేదీలు ఒకేసారి వచ్చే అవకాశం ఉన్నందున, బీసీసీఐ (BCCI) ఇంకా తుది షెడ్యూల్ను ఖరారు చేయలేదు.
రెండు విడతల్లో షెడ్యూల్ ప్రకటన?
ఎన్నికల కమిషన్ తేదీలను ప్రకటించిన వెంటనే ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ ఇవ్వాలని బీసీసీఐ యోచించింది. అయితే సమయం మించిపోతుండటం, ఫ్రాంచైజీల నుండి ఒత్తిడి పెరుగుతుండటంతో.. బోర్డు ముందుగా పాక్షిక షెడ్యూల్ను (కొన్ని మ్యాచ్ల వరకు) విడుదల చేసే అవకాశం ఉంది. ఎన్నికల తేదీలు వచ్చాక మిగిలిన షెడ్యూల్ను ప్రకటిస్తారు.
ఐపీఎల్ షెడ్యూల్ను ఇలా రెండు భాగాలుగా విడుదల చేయడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో 2019 లోక్సభ ఎన్నికల సమయంలో కూడా ఇదే పద్ధతిని అనుసరించారు. మార్చి మొదటి వారంలో ప్రాథమిక లేదా తాత్కాలిక షెడ్యూల్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
